పతాక స్థాయికి.. | - | Sakshi
Sakshi News home page

పతాక స్థాయికి..

Apr 23 2025 7:59 AM | Updated on Apr 23 2025 8:45 AM

పతాక స్థాయికి..

పతాక స్థాయికి..

అరాచకం..

తుని: కూటమి నేతల అరాచకం తునిలో పతాక స్థాయికి చేరింది. తోటి దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆ కుటుంబంపై ఓ టీడీపీ నాయకుడు, తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల తరఫున నిలవాల్సిన పోలీసులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి.. నిందితులను అరెస్టు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూండటంతో.. ఓ దళిత కుటుంబం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందోనని క్షణక్షణం భయాందోళనకు గురవుతోంది. బాధితుల కథనం ప్రకారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలివీ..

తుని పట్టణం 4వ వార్డు కొండవారిపేటకు చెందిన ఓ దళిత మహిళపై ఫిబ్రవరి 19న టీడీపీ నాయకుడు లావేటి సతీష్‌ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన స్థానిక ఆరుగుల వారి వీధికి చెందిన వైఎస్సార్‌ సీపీ గృహ సారథి ఆరుగుల గంగరాజు, ఆయన భార్య వాణీకుమారి తదితరులు అతడిని అడ్డుకున్నారు. దీంతో, సతీష్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై అదే రోజు రాత్రి బాధితులు తుని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో స్థానికులతో కలిసి బాధిత మహిళతో పాటు ఆరుగుల గంగరాజు కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 20న కాకినాడ వెళ్లి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్‌, అనుచరులను అరెస్ట్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలు బలంగా ఉన్నందున ఎక్కడ ఇరుక్కుంటామోననే భయంతో.. గంగరాజు కుటుంబాన్ని సతీష్‌, అనుచరులు పలుసార్లు హెచ్చరించారు. దళిత మహిళకు అండగా నిలిచారన్న కోపంతో 20 మంది అనుచరులతో కలిసి సతీష్‌ ఈ నెల 6న గంగరాజు కుటుంబంపై దాడి చేశారు. కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదించారు. అయినప్పటికీ మాట వినడం లేదన్న అక్కసుతో ఈ నెల 20వ తేదీ రాత్రి సతీష్‌ మరోసారి తన అనుచరులతో కలిసి గంగరాజు ఇంటికి వెళ్లాడు. ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి, వారిని గాయపరిచారు. ఈ దాడిలో గంగరాజు చేయి విరిగిపోయింది. తలపై బలమైన గాయమైంది. అతడిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. తమకు లావేటి సతీష్‌, కె.డేవిడ్‌రాజు, ఆరుగుల నవీన్‌, ఆరుగుల దుర్గాప్రసాద్‌, కాపారపు మనోజ్‌, కాపారపు రాజు, కుందేటి జాన్‌, ఎగ్గాడ బాల ఏసు, గంపల గంగబాబు, మామిడి వినాయక్‌, గుండుబిల్లి నాగేశ్వరరావు, కండవల్లి అన్నపూర్ణ, కేసరపు నాగమణి తదితరుల నుంచి ప్రాణహాని ఉందని గంగరాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఫ గతంలో దళిత మహిళపై లైంగిక దాడికి టీడీపీ నాయకుడి యత్నం

ఫ ప్రతిఘటించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

ఫ సాక్ష్యంగా నిలిచిన కుటుంబంపై టీడీపీ గూండాల దాడులు

ఫ పోలీసుల ప్రేక్షకపాత్ర

ఫ బాధితులకు మాజీ మంత్రి రాజా పరామర్శ

నిందితులను అరెస్టు చేయాలి

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, అంబేడ్కర్‌ రాజ్యాంగం కల్పించిన హక్కులను టీడీపీ నేతలు కాలరాస్తూంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. టీడీపీ నాయకుడు సతీష్‌, అతడి అనుచరుల దాడిలో గాయపడిన గంగరాజు, వాణీకుమారిలను మంగళవారం ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దళిత మహిళపై టీడీపీ నాయకుడు లావేటి సతీష్‌ లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ఘటనలో సాక్షులుగా ఉన్న గంగరాజు, వాణీకుమారిపై రెండుసార్లు దాడికి ఒడిగట్టారని అన్నారు. ఈ దాడిపై తుని పట్టణ పోలీసులు కేసు నమోదు చేయలేదని, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారని, అయితే, నిందితులను అరెస్ట్‌ చేయలేదని చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాలను తుని పోలీసులు పట్టించుకోనందువల్లనే రెండుసార్లు దాడికి ఒడిగట్టారని అన్నారు. అధికార పార్టీకి చెందిన తమపై సాక్ష్యం చెప్తే చంపేస్తామంటూ లావేటి సతీష్‌ హెచ్చరించడంతో పాటు అనుచరులతో గంగరాజు ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినా పోలీసులు నిరక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో జైల్లో ఉండాల్సిన నిందితులు బయట తిరుగుతున్నారని, వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అణగారిన వర్గానికి చెందిన బాధితులపై జరిగిన దాడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, కఠినమైన సెక్షన్లు పెట్టాలని అన్నారు. బాధితులకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తుందని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గమనించాలని హితవు పలికారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు రాజా విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా దాడులు జరిగితే ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు అన్నవరం శ్రీను, రేలంగి రమణాగౌడ్‌, లగుడు శ్రీనివాస్‌, వేముల రాజబాబు, నక్కా జాన్‌ ఆనంద్‌, మీలా బుజ్జి, కౌన్సిలర్లు కర్రి సత్య జగదీష్‌, చింతల సునీత, మాజీ కౌన్సిలర్‌ చితకల రత్నకుమారి, కోరుమిల్లి లలిత, మర్రా దాసు, కాసే కపిల్‌, చింతల పండు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement