నీ కొలువుకు సెలవు స్వామీ..! | - | Sakshi
Sakshi News home page

నీ కొలువుకు సెలవు స్వామీ..!

Apr 18 2025 12:08 AM | Updated on Apr 18 2025 12:08 AM

నీ కొ

నీ కొలువుకు సెలవు స్వామీ..!

రత్నగిరిపై ఇద్దరు ఉద్యోగుల వీఆర్‌ఎస్‌

దీర్ఘకాలిక సెలవులో మరో ఇద్దరు

సెలవు ఇస్తే తామూ సిద్ధమేనంటున్న మరికొందరు

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని దుస్థితి నెలకొంది. ఈఓ వీర్ల సుబ్బారావుకు, దేవస్థానం ఉద్యోగులకు మధ్య అంతర్గతంగా ఏవైనా సమస్యలున్నాయో లేక ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారో కానీ రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ బాట పడుతున్నారు. మరికొంత మంది దీర్ఘకాలిక సెలవులో వెళ్తున్నారు. పలుకుబడి ఉన్న ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ చేయించుకుంటున్నారు. మిగిలిన ఉద్యోగులు తమకు వారాంతపు సెలవు కూడా సెలవు ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..

దేవస్థానంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న సీహెచ్‌ రామ్మోహన్‌రావు కొన్ని రోజుల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేశారు. అన్నవరం దేవస్థానం ఉద్యోగిగా విధుల్లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి, అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయికి చేరుకున్నారు. పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం ఈఓగా పని చేశారు. ఆ తరువాత అన్నవరం దేవస్థానంలోనే ఉద్యోగ విరమణ చేయాలనే కోరికతో ఇక్కడకు బదిలీపై వచ్చారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు సమర్పించారు.

● దేవస్థానంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న వేంకటేశ్వరరావు కూడా వ్యక్తిగత కారణాలంటూ గురువారం వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

● ఒక ఏఈఓ అనారోగ్య కారణాలతో గత నెలలో నెల రోజులు సెలవు పెట్టారు.

● మరో సూపరింటెండెంట్‌ తన తల్లికి అనారోగ్యం అని పేర్కొంటూ సింహాచలం దేవస్థానానికి బదిలీ చేయించుకున్నారు.

● మరోవైపు ఏ పనీ లేకపోయినా వారాంతపు సెలవు దినమైన మంగళవారం కూడా దేవస్థానానికి రావాల్సి వస్తోందని చాలా మంది సిబ్బంది అసంతృప్తి చెందుతున్నారు.

● దగ్గరి బంధువు పెళ్లికి ఒక పూట సెలవు కోరగా నిరాకరించడంతో దేవస్థానంలో కీలక విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి వరకూ సేవ

బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఓ కేంద్ర మంత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తొమ్మిది గంటలకు రత్నగిరికి వచ్చారు. గతంలో అయితే ఆ మంత్రికి ఈఓ స్వాగతం పలికి, ఎవరో ఒక దేవస్థానం అధికారికి ఆయన బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయేవారు. అయితే ఈ కేంద్ర మంత్రికి మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దేవస్థానం అధికారులందరూ సేవలందించాల్సి వచ్చింది. మళ్లీ మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకే వారందరూ విధులకు హాజరు కావాల్సి వచ్చింది. దీనిపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

62 ఏళ్లకు పెంచాలని కోర్టుకు వెళ్లి..

గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. అలాగే, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ రెండు సందర్భాల్లోనూ తమకు కూడా ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని కోరుతూ దేవస్థానం ఉద్యోగులు కోర్టులో కేసులు వేసి, విజయం సాధించారు. అటువంటిది ఇప్పుడు ఇంకా ఉద్యోగ విరమణకు సమయం ఉన్నప్పటికీ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేస్తూండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానంలో ఉద్యోగుల అసంతృప్తికి కారణమేమిటనే దానిపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు, మౌలిక వసతుల విషయంలో రోజు రోజుకూ అసంతృప్తి పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో.. దీనిని ఇలాగే వదిలేస్తే దేవస్థానం మరింత అప్రతిష్ట మూటకట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

కొండకు చినబాబు దూరం

‘చినబాబు వచ్చారు.. బహుపరాక్‌’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం కథనం ప్రచురించిన నేపథ్యంలో రెండు రోజులుగా ఆయన రత్నగిరిపై కనిపించడం లేదు. దీంతో దేవస్థానం ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పటికే కావల్సినంత నష్టం జరిగిపోయిందని సిబ్బంది అంటున్నారు.

నీ కొలువుకు సెలవు స్వామీ..!1
1/1

నీ కొలువుకు సెలవు స్వామీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement