సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట రామయ్య అన్నారు. కాకినాడ డీసీసీబీ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సహకార ఉద్యోగులకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ చేయించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కోశాధికారి పెంకె సత్యనారాయణ మాట్లాడుతూ, 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం సహకార సంఘాల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలని కోరారు. అనంతరం డీసీసీబీ ఇన్‌చార్జ్ సీఈఓ ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు వై.రామచంద్రరావు, ఎ.ఆదినారాయణ, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


