మరచిన సొమ్ము ఇదిగో..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చాలా మందికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలుంటాయి. బదిలీ జరిగో, బతుకు తెరువు కోసమో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినప్పుడు పాత బ్యాంకు ఖాతాలను పలువురు వినియోగించరు. అందులో ఉన్న సొమ్ము గురించి మరచిపోతూంటారు. అలాగే, కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే వారి ఖాతాలోని సొమ్ము గురించి వారసులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. ఇన్నాళ్లూ ఇటువంటి సొమ్మును కనీసం క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉండటం లేదు. దీంతో, బ్యాంకు వినియోగదార్లు నష్టపోతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించింది. వారికి మేలు చేసే లక్ష్యంతో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (ఉద్గమ్) పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా క్లెయిమ్ చేయని ఖాతాలను ఖాతాదారులు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. అటువంటి ఖాతాదారులు, వారి వారసులు సంబంధిత బ్యాంకులను సంప్రదించి, తగు ఆధారాలు సమర్పిస్తే అన్‌క్లెయిమ్డ్ సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పదేళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును ఆయా బ్యాంకులు తిరిగి చెల్లిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ ఖాతాలకు ఈ అవకాశం వర్తిస్తుంది. జిల్లాలో 39 బ్యాంకులుండగా వాటి పరిధిలో 351 బ్రాంచిలున్నాయి.
అన్‌క్లెయిమ్డ్ సొమ్ము రూ.101.22 కోట్లు
ఏళ్ల తరబడి ఎటువంటి లావాదేవీలు జరగని వాటిని డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్ ఖాతాలుగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 5,72,938 వ్యక్తిగత ఖాతాల్లో రూ.83.36 కోట్లు, 10,048 సంస్థల ఖాతాల్లో రూ.12.60 కోట్లు, 5,535 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఖాతాల్లో రూ.5.26 కోట్లు కలిపి మొత్తం 5,88,521 ఖాతాల్లో రూ.101.22 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని 1.50 లక్షల ఖాతాల్లో దాదాపు రూ.45 కోట్లు ఈవిధంగా మూల్గుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఖాతాదారు నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి కెయిమ్ ఫామ్ నింపి, నో యువర్ కస్టమర్(కేవైసీ)కు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే ఆయా ఖాతాల్లోని సొమ్ము తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ ఖాతాదారు మృతి చెందితే వారి వారసులు సంబంధిత వ్యక్తి మరణ ధ్రువపత్రం కూడా సమర్పించాలి.
సద్వినియోగం చేసుకోవాలి
ఆర్‌బీఐ కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన ఖాతాదార్లు వినియోగించుకోవాలి. ఇప్పటికీ వీటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకూ జిల్లాలో దాదాపు 3 కోట్ల మంది వరకూ ఖాతాదారులకు రిఫండ్ చేశాం.
– చందాల శ్రీవెంకట ప్రసాద్, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం), కాకినాడ
ఉద్గమ్ పోర్టల్‌తో వివరాలు
గతంలో ఏళ్ల తరబడి లావాదేవీలు జరగని ఖాతాల్లోని వివరాలు తెలుసుకోవాలంటే ఖాతాదార్లు ఆయా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని బ్యాంకులకు సంబంధించి ఈ వివరాలను ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఒకేచోట తెలుసుకోవచ్చు. దీనికోసం మొదట ఉద్గమ్ అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. పేరు, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎవరి పేరిట డబ్బుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు ఇచ్చి సెర్చ్ చేయాలి. ఆ వెంటనే ఆ పేరిట ఏ బ్యాంకులో ఎంత అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో స్క్రీన్‌పై కనిపిస్తుంది. అనంతరం ఆయా బ్యాంకు బ్రాంచిలను పూర్తి ఆధారాలతో సంప్రదించాలి.
సమాచారం ఇలా..
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకు మేనేజర్లు తమ పరిధిలోని ఖాతాదారులకు లేదా వారి వారసులకు ఫోన్, మెసేజ్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు. అప్పటికీ స్పందన లేకపోతే సచివాలయ సిబ్బందికి వివరాలు అందజేయాలి. వారు ఆ సమాచారాన్ని ఆయా ఖాతాదారులకు లేదా వారి వారసులకు తెలియజేస్తారు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై బ్యాంకులు మూడు నెలలుగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ శిబిరాలు ఈ నెల 31తో పూర్తవుతాయి. ఈ అంశంపై ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు.
ఫ బ్యాంక్ ఖాతాలో వదిలేసిన నగదు తిరిగి పొందే చాన్స్
ఫ ఆర్‌బీఐ మార్గదర్శకాలు
ఫ ఆధారాలతో దరఖాస్తు చేస్తే చెల్లింపులు
ఫ బ్యాంకుల కసరత్తు
ఫ 31 వరకూ గడువు
మరచిన సొమ్ము ఇదిగో..


