గాంధీజీ ఆనవాళ్లను తుడిచేస్తున్నారు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కులమతాలకు అతీతంగా చివరి ఊపిరి వరకూ ప్రజల కోసమే పని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ ఆనవాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుడిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ.. స్థానిక గాంధీనగర్ పార్కులో బాపూజీ విగ్రహం వద్ద సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన సోమవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తొలుత రామారావుపేట సెంటర్ నుంచి గాంధీనగర్ పార్కు వరకూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులకు ఎగనామం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. గాంధీజీ ఏం తప్పు చేశారని పేరు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి దొరుకుతోందని సంతృప్తి పడేలోపే వారు పస్తులుండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని, దీనికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, సాకా రామకృష్ణ పాల్గొన్నారు.


