కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

Dec 23 2025 6:55 AM | Updated on Dec 23 2025 6:55 AM

కొత్త

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

కాకినాడ రూరల్‌: కొత్తగా కానిస్టేబుళ్లుగా ఎంపికై న 282 మందికి తొమ్మిది నెలల శిక్షణను జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌ క్యాంపులో సోమవారం ప్రారంభించారు. శిక్షణకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తగా రూపొందించిన క్రిమినల్‌ చట్టాలను ఎంతో శ్రద్ధాసక్తులతో నేర్చుకోవాలని, శిక్షణను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కమాండెంట్‌ దేవానందరావు, అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 556 అర్జీలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 556 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల లబ్ధి వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలు సమర్పించారు. వీటిని గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు.

ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ అథ్లెటిక్స్‌లో రజతం

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): పాట్నాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ జరిగిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడా పోటీల్లో యు.కొత్తపల్లి మండలం మూలపేట జెడ్పీ హైస్కూల్‌ వ్యాయామోపాధ్యాయిని సునీత రజత పతకం సాధించారు. అథ్లెటిక్స్‌ 35–45 సంవత్సరాల కేటగిరీ లాంగ్‌జంప్‌లో ఆమె ఈ ఘనత సాధించారు. అలాగే, 100 మీటర్ల పరుగు పందెంలో ఆరో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సునీతను జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఏడీ షరీఫ్‌, వ్యాయామోపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్‌.జార్జి పాల్గొన్నారు.

సర్పవరం ఏఎస్సైకి డీజీపీ మెడల్‌

కాకినాడ రూరల్‌: సర్పవరం ఏఎస్సై ఎం.నాగేశ్వరరావు డీజీపీ మెడల్‌కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న అధికారులు, సిబ్బందికి డీజీపీ అవార్డులను సోమవారం ప్రకటించారు. దీనికి జిల్లా నుంచి ఇద్దరు ఎంపికవగా వీరిలో ఏఎస్సై నాగేశ్వరరావుతో పాటు ట్రాఫిక్‌ ఏఎస్సై హోదాలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌లో అటాచ్‌మెంట్‌ ద్వారా విధులు నిర్వర్తిస్తున్న రేగడమిల్లి వెంకట సత్య భాస్కర్‌ కూడా ఉన్నారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో డీజీపీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. వీరితో పాటు ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ నుంచి పలువురు డీజీపీ మెడల్‌కు ఎంపికయ్యారు.

అద్దేపల్లి ప్రభుకు

సాహితీ వేదిక పురస్కారం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అనేక సంవత్సరాలు గా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రాజమండ్రి సాహితీ వేదిక’ కాకినాడకు చెందిన రచయిత అద్దేపల్లి ప్రభుకు 2025 సంవత్సరానికి ‘సాహితీ వేదిక పురస్కారం’ ప్రకటించింది. ఈ నెల 25న స్థానిక గౌతమీ గ్రంథాలయంలో జరిగే సంస్థ వార్షిక సమావేశంలో ప్రభు కు పురస్కారంతో పాటు రూ.20 వేల నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు కుప్పిలి పద్మ తెలిపారు. క్లిష్టమైన వర్తమానాన్ని తన కథల్లో, కవితల్లో ఆవిష్కరిస్తూ, తెలుగు సాహిత్యానికి చేర్పునిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు వివరించారు. ప్రభు ఇప్పటికే ఆవాహన, పారిపోలేం, పిట్ట లేని లోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటాలను, ‘సీమేన్‌’ కథా సంపుటిని ప్రచురించారు.

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం 1
1/3

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం 2
2/3

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం 3
3/3

కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement