శతాబ్దాల ఘన చర్చితం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభదినం రెండు రోజుల్లో రానే వస్తోంది. ప్రేమ, శాంతి, కరుణ, క్షమ, నీతి వంటి సద్గుణాలను ఈ లోకానికి బోధించిన దైవ కుమారుడు.. ఏసు క్రీస్తు ఈ భూమిపై అడుగిడిన క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చర్చిలను ముస్తాబు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
క్రైస్తవులు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు శతాబ్దం కిందటే కాకినాడ నగరంలో అనేక చర్చిల నిర్మాణం జరిగింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలకుల హయాంలో క్రైస్తవ మిషనరీల నిర్వాహకులు వీటిని నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అవి నిలుస్తున్నాయంటే.. వాటిని ఎంత పటిష్టంగా, నాణ్యంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్, ఇటాలియన్ వంటి నిర్మాణ రీతులు ఈ చర్చిల్లో కనిపిస్తూ.. వీక్షకులను ఆకట్టుకుంటాయి.
చర్చి స్క్వేర్ సెంటర్
కాకినాడ నగరం అనగానే క్రైస్తవులకు గుర్తుకు వచ్చేది జగన్నాథపురంలోని చర్చి స్క్వేర్ సెంటర్. వందేళ్ల చరిత్ర కలిగిన నాలుగు చర్చిలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని చర్చి స్క్వేర్ సెంటర్‌గా పిలుస్తారు. ఇక్కడ ఇటలీకి చెందిన రోమన్ కేథలిక్ మిషన్‌తో పాటు బ్రిటిష్ పాలకుల హయాంలో నిర్మించిన పురాతన చర్చిలు ఉన్నాయి. ఈ నెల 25 క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 31 వరకూ క్రీస్తు జనన వేడుకను ఈ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవ భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొంటారు.
కోకనాడ సెయింట్ ఆన్స్ చర్చి
కోకనాడ సెయింట్ ఆన్స్ చర్చిని 1854లో జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్‌లో నిర్మించారు. దీని నిర్మాణానికి బాప్టిస్టు జేఎన్ టిస్సోట్, ఫెడ్రిక్ డికంపియోక్స్ ఆద్యులు. ఈ చర్చి నిర్మాణంలో ఇటలీ ఆర్కిటెక్చర్ స్పష్టంగా కనపడుతుంది. చర్చి బయట కొవ్వొత్తి వెలిగించి, మేరీ మాతను పూజించడానికి రాళ్లతో కట్టిన నిర్మాణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చర్చిలో ఏసుక్రీస్తు విగ్రహంతో ఆల్టర్(పరిశుద్ధ స్థలం)ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
ఫ కాకినాడలో ఎన్నో పురాతన చర్చిలు
ఫ వందేళ్లకు పైగా చరిత్ర వీటి సొంతం
ఫ నేటికీ చెక్కుచెదరని నిర్మాణాలు
శతాబ్దాల ఘన చర్చితం


