‘బహుపరాక్’ కథనంపై ఆరా
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అధికారి కుమార రత్నం అధికార కార్యకలాపాల్లో యథేచ్ఛగా పాల్గొంటూ సిబ్బందిని, దిగువ స్థాయి అధికారులను హడలెత్తిస్తున్న వైనంపై బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘చిన్నబాబు వచ్చారు ...బహుపరాక్ ’ వార్త తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ వార్తపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు చినబాబు ఎవరనే దానిపై ఆరా తీయడంతో బాటు ఆయన వ్యవహార శైలిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. డ్రోన్ కొనుగోలుపై అధికారిక సమావేశంలో ఆ అధికారితో బాటు ఆ పుత్రరత్నం పాల్గొనడం, ఆ ఫొటోలు, వీడియోలలో పుత్రరత్నాన్ని డిలీట్ చేయడం వంటి వాటిపై కూడా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం సింహాచలం దేవస్థానంలో జరిగిన చందనోత్సవం సమీక్ష సమావేశంలో రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కె.రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఆ సమావేశం అనంతరం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఈ కథనంపై సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందజేశారు.
నివేదిక పంపిన ఇంటెలిజెన్స్ అధికారులు
‘బహుపరాక్’ కథనంపై ఆరా


