
అంబేద్కర్‌కు ఘన సత్కారం
కాకినాడ క్రైం: అనాథ శవాలను తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తూ, సేవలో తరిస్తున్న కాకినాడకు చెందిన కూపర్ భాను అంబేద్కర్‌ను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఘనంగా సత్కరించారు. కలెక్టర్ ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా అంబేద్కర్ మంగళవారం కలెక్టరేట్‌కు వెళ్లి సత్కారాన్ని అందుకున్నాడు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న అంబేద్కర్ మానవత్వాన్ని వివరిస్తూ ‘అతడే ఆ నలుగురు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 13న ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్.. అంబేద్కర్ మానవత్వానికి చలించిపోయారు. ఆయనను నేరుగా చూడాలని సంకల్పించానని చెప్పారు. ఈ తరహా సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో అంబేద్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అంబేద్కర్‌కు సొంత ఇల్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంబేద్కర్‌ను సత్కరించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలెక్టర్ తన కార్యాలయానికి పిలిపించారు. వారి సమక్షంలో అంబేద్కర్‌ను ఘనంగా సత్కరించారు. ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు ఆర్థిక సాయం అందించారు.