ప్రసాద్ నిర్మాణాలివీ..
● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం.
● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్.
● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న ప్రదేశంలో అటు సత్య గిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ. 61.78 లక్షలతో టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం.
● రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్.
● రూ.91.96 లక్షలతో క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మాణం.
● సత్రాల నుంచి ఆలయానికి, వ్రత మండపాల మధ్య భక్తులను తరలించడానికి రూ.కోటితో రెండు బ్యాటరీ కార్లు.
● అయితే వీటిలో రూ.18.98 కోట్ల వ్యయమయ్యే నిర్మాణాలకు మాత్రమే టెండర్లు పిలిచారు. మిగిలిన పనులకు కూడా తరువాత టెండర్లు పిలవనున్నారు.
● ప్రస్తుత టెండర్లు 16 శాతం తక్కువకు ఖరారవడంతో రూ.3 కోట్లు ఆదా అయ్యాయి. ఈ మొత్తాన్ని కూడా దేవస్థానంలో నిర్మాణాలకు ఉపయోగించేలా అధికారులు ప్రయత్నించాలని పలువురు కోరుతున్నారు.
ఫ రూ.18.98 కోట్ల అంచనాతో టెండర్లు
ఫ 16 శాతం తక్కువకు దక్కించుకున్న సంస్థ
ఫ త్వరలో పనులు ప్రారంభం
అన్నవరం: కేంద్ర ప్రభుత్వ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము కింద సత్యదేవుని సన్నిధిలో వివిధ నిర్మాణాలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రూ.18.98 కోట్ల అంచనాతో చేపట్టనున్న వివిధ పనులకు టెండర్లు ఖరారయ్యాయని టూరిజం కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రసాద్ పనులకు తొలిసారి అక్టోబర్ 9న రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటిని అదే నెల 25న ఖరారు చేయాల్సి ఉండగా, గత డిసెంబర్‌లో రద్దు చేశారు. తిరిగి జనవరి 9న రెండోసారి టెండర్లు పిలిచారు. ఈసారి రూ.18.98 కోట్లకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు ఆహ్వానించారు. వీటిని జనవరి 24న ఖరారు చేయాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో సుమారు రెండు నెలల పాటు కాలయాపన జరిగింది. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ కోసమే ఇలా జాప్యం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎడతెగని ఈ జాప్యంపై శ్రీసాక్షిశ్రీ పలు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఎట్టకేలకు టెండర్లు ఖరారు చేశారు. రెండోసారి నోటిఫికేషన్ విడుదల చేయగా ఆరుగురు కాంట్రాక్టర్లు కొటేషన్లు దాఖలు చేశారు. వీటిలో సాంకేతిక అర్హతలు లేవనే కారణంతో రెండింటిని తిరస్కరించారు. మిగిలిన నాలుగింటిలో శ్రీకాకుళానికి చెందిన అనంతరాములు కంపెనీ 18 శాతం తక్కువకు కొటేషన్ దాఖలు చేసి, టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ అంచనా వ్యయం కన్నా దాదాపు రూ.3 కోట్ల తక్కువకు పనులు చేయనుంది.
పదేళ్ల నిరీక్షణకు తెర
ప్రసాద్ పథకానికి అన్నవరం దేవస్థానం ఏ ముహూర్తాన ఎంపికై ందో కానీ, ఆది నుంచీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను యాత్రా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో నిర్ణయించారు. దీనికోసం రూపొందించిన ప్రసాద్ స్కీముకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఎంపిక చేయగా, వీటిలో అన్నవరం దేవస్థానం కూడా చోటు దక్కించుకుంది. ఈ పథకం నిధుల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత ఎన్నోసార్లు నాటి కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డితో, ఆ శాఖ కార్యదర్శులతో సమావేశమై అనుమతి సాధించారు. పదేళ్ల కాలయాపన అనంతరం ఎట్టకేలకు ఈ పథకం పనులకు టెండర్లు ఖరారయ్యాయి.
రూ.100 కోట్లతో ప్రతిపాదనలు
ప్రసాద్ స్కీము కింద రత్నగిరి పైన, దిగువన వివిధ నిర్మాణాలు చేపట్టేందుక రూ.100 కోట్లతో దేవస్థానం ప్రతిపాదనలు పంపించింది. అంత మొత్తం ఇవ్వలేమని రూ.50 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఆ మేరకు తిరిగి ప్రతిపాదనలు పంపించారు. అక్కడి నుంచి గీచిగీచి బేరాలాడినట్లు చివరకు రూ.23 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ నిధులతో చేపట్టే పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది జరిగిన ఏడాది తరువాత ఈ పనులకు టెండర్లు ఖరారు చేయడం గమనార్హం.
వచ్చే నెలలో ప్రారంభం
అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీము పనులకు పిలిచిన రీ టెండర్లు ఖరారు చేశారు. వచ్చే నెలలో ఈ నిర్మాణాల పనులు మొదలవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో టెండర్ల ఖరారు ఆలస్యమైంది.
– ఈశ్వరయ్య,
సీఈ, టూరిజం శాఖ


