వరకట్నం వేధింపుల కేసులో తీర్పునిచ్చిన మేజిస్ట్రేట్
రాజమహేంద్రవరం రూరల్: వరకట్నం వేధింపుల కేసులో శిక్ష పడిన ఎస్‌ఐ మల్లులు సతీష్‌కుమార్, అతని తల్లి మల్లుల విజయ శారద లకు దిగువ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు తీర్పు నిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన శిరీషను హైదరాబాద్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న మల్లుల సతీష్ కుమార్ వివాహం చేసుకున్నాడు. రూ.17 లక్షల కట్నం ఇచ్చి శిరీష తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించారు. వివాహమైన కొద్ది రోజులకే నాలుగు అంతస్తుల బిల్డింగ్, డాబా ఇంటిని అమ్మి అదనంగా రూ.కోటి కట్నం తీసుకురమ్మని, రూ.25 లక్షలతో వాహనం కొని ఇవ్వాలని ఎస్సై సతీష్‌కుమార్ డిమాండ్ చేశాడు.
అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధించమే కాకుండా అడిగినట్టుగా ఇవ్వకపోతే విడాకులు ఇమ్మని, తెల్ల కాగితాలపై, స్టాంప్ పేపర్‌పై సంతకాలు చేయమని వేధించారు. సతీష్‌కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి శిరీష వద్ద ఉన్న 35 కాసుల బంగారం తీసుకొని ఆమెను ఇంటి నుంచి గెంటి వేశాడు. రాజమహేంద్రవరం వచ్చిన సతీష్ కుమార్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం డిమాండ్ చేయడమే కాకుండా శిరీష తల్లిదండ్రులపై దౌర్జన్యం చేశారు. బాధితురాలు రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను విచారించిన అనంతరం సతీష్‌కుమార్‌కు ఐదేళ్ల జైలు శిక్ష , రూ.17 లక్షల జరిమానా, భార్యను వేధించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు.
అత్తగారైన విజయశారదకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.21,000 జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఐదవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆనాటి న్యాయమూర్తి సీహెచ్‌వీ రామకృష్ణ 2018 ఆగస్టులో తీర్పునిచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై ఉద్యోగం నుంచి సతీష్‌కుమార్‌ను తొలగించారు. వారు తమకు పడిన శిక్షలపై రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు మంగళవారం కింద కోర్టులో ఇచ్చిన తీర్పును ఖరారు చేశారు. ఇప్పటికే జిల్లా కోర్టులోనూ, మనోవర్తి కేసులోనూ సతీష్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరత్నం బాబు బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు.


