మిల్లర్లపై కేసులు.. అధికారుల సంగతేంటి? | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లపై కేసులు.. అధికారుల సంగతేంటి?

Nov 6 2026 12:44 AM | Updated on Nov 6 2026 12:44 AM

గద్వాల: ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతున్నా.. బాధ్యులైన మిల్లర్లపై కేసులు నమోదవుతున్నా.. ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై మాత్రం చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎమ్మార్‌) కింద తిరిగి బియ్యంగా అప్పగించాల్సిన రైస్‌మిల్లర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క గద్వాల జిల్లాలోనే సుమారు రూ.70 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ మొత్తం రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో మరో మూడు మిల్లులపై కేసులు నమోదవడం ఈ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్న అధికారులు.. వారికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ శాఖలోని అధికారులపై ఎందుకు విచారణ చేపట్టడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మిల్లర్ల అవతారంలో అక్రమార్కులు

ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సేకరించిన ధాన్యాన్ని మిల్లుల సామర్థ్యాన్ని బట్టి రైస్‌మిల్లర్లకు కేటాయించి, నిర్ణీత గడువులో సీఎమ్మార్‌ బియ్యం తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని నిబంధనలు విధిస్తోంది. అయితే ఈ ప్రక్రియలో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాల్లో ఉన్నవారు, మిల్లింగ్‌ రంగంలో అనుభవం లేనివారు సైతం మిల్లుల ఏర్పాటుకు అనుమతులు పొందడం, ధాన్యం కేటాయింపులు దక్కించుకోవడం వెనుక కొందరు అధికారుల సహకారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు, ధాన్యం కేటాయింపులు, సీఎమ్మార్‌ బియ్యం స్వీకరణ వరకు ప్రతి దశలోనూ అధికారుల పర్యవేక్షణ అవసరమనే నేపథ్యంలో ఈ ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది.

7.57 లక్షల టన్నుల ధాన్యం

2025–26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వం 7.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు కేటాయించింది. అక్టోబర్‌ 31 నాటికి సీఎమ్మార్‌ బియ్యం తిరిగి అప్పగించాల్సి ఉండగా.. అప్పటి వరకు సగం మాత్రమే అందించినట్లు సమాచారం. అందులోనూ సన్నరకం ధాన్యానికి బదులుగా దొడ్డురకం బియ్యాన్ని అప్పగించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మూడు మిల్లులపై కేసులు

గద్వాల జిల్లాలో రాధాకృష్ణ రైస్‌మిల్‌, ఫరీదా రైస్‌మిల్‌, దువాసిపల్లి వెంకటేశ్వర మోడ్రన్‌ రైస్‌మిల్లులపై అక్రమాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు మిల్లర్లు రిమాండ్‌కు వెళ్లారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై పోలీసు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ అక్రమాలు జరగడానికి కారణమైన అధికారుల పాత్రపై మాత్రం సమగ్ర విచారణ జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

2025–26 ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా

కేటాయించిన ధాన్యం వివరాలు....

జిల్లా మిల్లులు కేటాయించిన

ధాన్యం (మె.ట)

మహబూబ్‌నగర్‌ 77 1,47,938

గద్వాల 49 1,34,495

వనపర్తి 69 2,20,182

నాగర్‌కర్నూల్‌ 56 1,14,442

నారాయణపేట 51 1,40,266

ఉమ్మడి జిల్లాలో రూ.200 కోట్లకుపైగా సీఎమ్మార్‌ ధాన్యం పక్కదారి

ఒక్క గద్వాల జిల్లాలోనే రూ.70 కోట్ల విలువైన ధాన్యం స్వాహా

అక్రమాలకు పాల్పడిన 3 మిల్లులపై కేసులు.. ఇద్దరు మిల్లర్లకు రిమాండ్‌

మిల్లర్లకు సహకరించిన

అధికారుల మాటేమిటి?

ఇతర జిల్లాల్లో అధికారులపై చర్యలు.. ఉమ్మడి పాలమూరులో అంతా గప్‌చుప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement