గద్వాల న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల శనివారం నుంచి సోమవారం వరకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో నిర్వహించనున్న కిసాన్ మేళాకు జిల్లా నుంచి రైతులు పెద్దఎత్తున తరలివెళ్లేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మండలాల అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించి.. బస్సుల ఏర్పాట్లు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మాట్లాడారు. కిసాన్ మేళాతో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రధానంగా సోమవారం ఉదయం 10 గంటల వరకు బస్సులు అన్ని మండలాలకు చేరుకోవాలని, మొత్తం 50 బస్సుల్లో జిల్లా రైతులు మేళా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కవ మంది రైతులు ఆసక్తి చూపితే అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి బస్సుకు ఒక సమన్వయ అధికారి, వైద్య సిబ్బంది, ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉండాలన్నారు. బస్సులపై ఆయా మండలాల పేర్లు, ఇతర అవసరమైన వివరాలు అతికించాలన్నారు. 10 బస్సులకు ఒక పోలీస్ అధికారి పర్యవేక్షణ ఉండాలని, ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో మధ్యాహ్న, రాత్రి భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, డీఎస్పీ మొగిలయ్య, డీఏఓ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.
● పట్టభద్రుల ఓటరు నమోదు కోసం వచ్చిన ఫారం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టర్లతో వీసీ నిర్వహించి ఓటరు జాబితాపై సమీక్షించారు. ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌లో వచ్చిన దరఖాస్తులను వెరిఫికేషన్ వేగవంతం చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులు, యువతకు ఓటుహక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం ఇప్పటి వరకు 20,917 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. గత ఎన్నికల్లో 14 వేల ఓటరు దరఖాస్తులు రాగా.. ఈసారి భారీగా పెరిగా యని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎన్నికల వి భాగ అధికారి మంజుల పాల్గొన్నారు.


