అక్రమార్కులపై కొరడా! | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై కొరడా!

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

–8లో u

గద్వాల: జిల్లాలో ప్రభుత్వం నుంచి తీసుకున్న వరిధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ అక్రమాలపై ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అక్రమార్కులు, అధికారులు.. చెట్టాపట్టాల్‌’ కథనంపై కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ స్పందించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సివిల్‌ సప్లయ్‌శాఖ అధికారులను ఆదేశించారు. అక్రమార్కులతో పాటు వారికి సహకరించే అధికారులు తప్పకుండా మూ ల్యం చెల్లించుకుంటారని తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో హడలెత్తిపోయిన అధికారులు.. విజిలెన్స్‌ అధికారుల నివేదిక ఆధారంగా మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ సొమ్ము దోపిడీ..

ప్రభుత్వం రూ. వేల కోట్లతో రైతుల వద్ద మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. సీఎంఆర్‌ పేరుతో రైస్‌మిల్లర్లు సివిల్‌ సప్లయ్‌శాఖ అధికారులతో జతకలిసి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించి కస్టమ్‌ రైస్‌ ఇవ్వాల్సి ఉండగా.. నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదివరకే కేటీదొడ్డిలో సుమారు రూ. 40కోట్లు, శాంతినగర్‌, కాకులారం, అయిజలలో మరో రూ. 13కోట్ల ఽవిలువైన ధాన్యం పక్కదారి పట్టించిన ఘటనలో క్రిమినల్‌ కేసులున్నాయి. వీటిపై అధికారులు ఆర్‌ఆర్‌ యాక్టు కింద కేసులు నమోదుచేసి చేతులు దులిపేసుకున్నారు.

తాజాగా మూడు మిల్లులపై కేసులు..

ఇటీవల జిల్లాలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలు ఉన్నాయా.. లేదా అని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే అయిజలోని శ్రీనివాస రైస్‌మిల్లు, జిల్లా కేంద్రంలోని డీవీఆర్‌ మిల్లు, ఽరాధాకృష్ణ రైస్‌మిల్లు, గద్వాల మండలం కొత్తపల్లికి వెళ్లే మార్గంలోని ఫరీదా రైస్‌మిల్లులో రూ.కోట్లు విలువజేసే ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీనిపై సివిల్‌ సప్లయ్‌శాఖ అధికారులు మూడు మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసులతోనే సరిపెడుతారా?

ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 50కోట్ల ధాన్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. అందులో కేటీదొడ్డి, శాంతినగర్‌, అయిజ, గద్వాల మండలం కాకులారం మిల్లుల యజమానులపై కేసులు నమోదయ్యాయి. కానీ రూ. 50కోట్ల ధాన్యం రికవరీ చేయడాన్ని అధికారులు మర్చిపోయారు. తాజాగా మూడు మిల్లులపై నమోదైన కేసుల్లో సైతం అధికారులు ఇదే తీరు వ్యవహరిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రికవరీ చేస్తాం..

ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన రాధాకృష్ణ రైస్‌మిల్లు, డీవీఆర్‌ రైస్‌మిల్లు, ఫరీదా రైస్‌మిల్లులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మూడు మిల్లుల యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా ప్రభుత్వ సొమ్మును రికవరీ చేస్తాం. అదే విధంగా అయిజలోని శ్రీనివాస రైస్‌మిల్లు యజమాని డబ్బులు చెల్లిస్తానని గడువు కోరాడు. అప్పటిలోగా డబ్బులు చెల్లించకపోతే సదరు మిల్లుపై కూడా కేసు నమోదు చేస్తాం. అలాగే దువాసిపల్లి రైస్‌మిల్లులో అక్రమాలు జరిగాయని గుర్తించాం. పూర్తినివేదిక రావాల్సి ఉంది. నివేదిక ఆధారంగా సదరు మిల్లుపై కేసు నమోదు చేస్తాం. అనంతపురంలో కొత్త మిల్లు నిర్మాణ విషయం నా దృష్టికి రాలేదు. విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం.

– విమల, డీఎం, సివిల్‌ సప్లయ్‌శాఖ

ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్‌మిల్లర్లపై కేసులు

నాలుగు మిల్లుల్లో రూ.10కోట్ల ధాన్యం మాయంపై ‘సాక్షి’ వరుస కథనాలు

మూడు మిల్లులపై మాత్రమే చర్యలు

మరో మిల్లర్‌పై కేసు నమోదు చేసేందుకు అధికారుల తాత్సారం

గద్వాల మండలంలో మరో మిల్లు నిర్మిస్తున్న సదరు మిల్లర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement