కేటీదొడ్డి: గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న కేటీదొడ్డి, గట్టు మండలాల రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం పార్టీ బృందం గట్టు రిజర్వాయర్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో భారత్మాల రోడ్డు నిర్మాణంలో రూ. 6 లక్షల నుంచి రూ. 12లక్షల పరిహారం ఇస్తామని చెప్పి, కేవలం రూ. 6 లక్షలే ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. మళ్లీ గట్టు ఎత్తిపోతల కాల్వ నిర్మాణానికి భూములు సేకరిస్తున్నారని.. వ్యవసాయాన్నే జీవానాధారంగా బతుకుతున్న రైతులకు సరైనా పరిహారం ఇవ్వకపోతే వారి జీవితాలు అంధకారమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వీవీ నర్సింహ, తిమ్మప్ప, ఆంజనేయులు, శంకరన్న తదితరులు పాల్గొన్నారు.


