ఏడుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

ఏడుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లపై సస్పెన్షన్‌ వేటు

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

● కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ చర్యలు

గద్వాల: కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లపై కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ కొరడా ఝుళిపించారు. వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కూలీలకు వందశాతం ఉపాధి కల్పించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో వీబీ–జీ రామ్‌జీ పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతు కూలీలకు పెద్దఎత్తున జాబ్‌కార్డులను అందజేసి, వారికి సరిపడా ఉపాధి పనులను కల్పించాలన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి కుంటలు, ఇంకుడుగుంతలు, రూప్‌టాప్‌ హార్వేస్టింగ్‌ తదితర పనులను వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వతో పాటు ఆర్డీఎస్‌ కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా సుమారు 375 రకాల పనులను చేయవచ్చన్నారు. సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి కూలీలకు 125 రోజులు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలన్నారు. స్వగ్రామంలోనే కూలీలు ఉపాధిహామీతో లబ్ధిపొందేలా చర్యలు తీసుకోవాలని.. ఎవరైనా వలసలు వెళ్లే పరిస్థితులు ఏర్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

● పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, మౌలిక వసతులను తనిఖీ చేయడంతో పాటు ఉపాధ్యాయులు , విద్యార్థుల హాజరును తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో బోధన చేపట్టాలన్నారు. వారి అభ్యసన ప్రగతిపై సబ్జెక్టుల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగనీటివసతి సౌకర్యాల వివరాలను ఎప్పటికప్పుడు యూ–డైస్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి ఉన్నారు.

పత్తి రైతులకు

ఇబ్బందులు లేకుండా కొనుగోలు..

జిల్లాలోని పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో హరిత, బాలాజీ పత్తి మిల్లుల్లో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా పత్తి కొనుగోలు, మార్కెట్‌ ధరలు వంటి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులు పత్తిని విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా అనవసరమైన రవాణా ఖర్చులతో నష్టపోతారన్నారు. స్థానికంగా పత్తి కొనుగోళ్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందన్నారు. సీసీఐ ద్వారా క్వింటాకు రూ. 8,667 ధర లభిస్తుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట మార్కెటింగ్‌ అధికారి పుష్పమ్మ, కార్యదర్శి ఎల్లస్వామి, రాహు ల్‌, మిల్లు యజమాని సత్యారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement