అలంపూర్: శాసీ్త్రయ సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ పి.అర్చన అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని బుక్కాపురంలో గురువారం టీఆర్‌వీకే, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త అర్చన మాట్లాడుతూ.. పంటల్లో చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించి, శాసీ్త్రయ సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా పంట నష్టాలను నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. మిరప పంటలో బొరాన్, మెగ్నీషియం లోపాలను గుర్తించినట్లు చెప్పారు. వాటి నివారణకు లీటరు నీటిలో ఒక గ్రాము బొరాన్, 4–5 గ్రాముల మెగ్నీషియం కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. నాలుగు రోజుల వ్యవధిలో అగ్రోమిన్ మ్యాక్స్, మరో నాలుగు రోజుల తర్వాత ఫార్ములా–7 పిచికారీ చేయాలన్నారు. పత్తి పంటలో గులాబీ రంగు, కాయతొలుచు పురుగు ఉనికిని గుర్తించామని.. రెండవ ఏరివేత పూర్తయిన తర్వాత పంటను కొనసాగించడానికి ఆర్థికంగా లాభదాయకం కాని పరిస్థితుల్లో పూర్తిగా తొలగించి, పత్తి అవశేషాలను సక్రమంగా తొలగించాలని సూచించారు. దాదాపు 50 రోజుల వయసు ఉన్న మినుము పంటలో పసుపు రంగు మొజాయిక్ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు రసం పీల్చే పురుగులను నియంత్రించాలన్నారు. అలాగే మారుకా పురుగు నివారణకు ఎకరానికి 80 మి.లీ. యాంప్లిగో వినియోగించాలని రైతులకు సూచించారు. దాదాపు 30 రోజుల వయసు ఉన్న శనగ పంటలో బీట్ ఆర్మీవార్మ్ పురుగు ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. గుడ్ల సమూహాలు, చిన్న లార్వాలను సేకరించి నాశనం చేయాలన్నారు. అవసరమైనప్పుడు సిఫారసు చేసి న జీవ నియంత్రణ పద్ధతులు, పురుగు మందులను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో పాలెం శాస్త్రవేత్తలు మమత, మాధురి, శ్రీరామ్, శంకర్, ఏఓ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.


