ఆయకట్టుకు నీటిగండం! | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు నీటిగండం!

Oct 27 2026 12:03 AM | Updated on Oct 27 2026 12:03 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం జూరాలలో 2.862 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. రానున్న గడ్డుకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక తాగునీటి అవసరాలకే జలాశయంలోని నీటిని నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు జూరాల కుడి, ఎడమ కాల్వలకు శనివారం సాగునీటిని నిలిపివేశారు. ఎగువ నుంచి వరదలు వస్తేనే నవంబర్‌ వరకు సాగునీటిని విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని.. వరద రాకపోతే ఈ నెలాఖరులో 4 రోజులపాటు కాల్వలకు సాగునీటిని అందించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు పీజేపీ సీఈ రహీముద్దీన్‌ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వరిపైరు పొట్టదశలో ఉందని.. నవంబర్‌ వరకు సాగునీరు అందిస్తేనే పంట చేతికొస్తుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎగువ నుంచి వరద రాకపోవడంతోనే..

జూరాలకు ఎగువ నుంచి చుక్క నీరు కూడా రాకపోవడమే ఆయకట్టుకు సాగునీటి నిలిపివేతకు ప్రధాన కారణం. సాగునీటి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో రాష్ట్ర మంత్రులు కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి.. 5 టీఎంసీల నీరు వదలాలని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం 3 టీఎంసీలను వారాబందీ విధానంతో అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు మొదట పది రోజులు 5వేల క్యూసెక్కులను జూరాలకు వదిలింది. ఈ క్రమంలో అక్కడి రైతుల ఆందోళనతో కర్ణాటక ప్రభుత్వం జూరాలకు సాగునీటిని నిలిపివేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే జూరాల ఆయకట్టుకు సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు వారాబందీని రోజుల వారీగా కుదించాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు. మొదట 5 రోజులు, రెండవ సారి 4 రోజులు, మూడో సారి 3 రోజులు, ఇలా రెండు రోజుల పాటు కాల్వలకు నీటిని వదలాలనే ప్రతిపాదనలో ఉన్నారు. ఇప్పటికే కుడి, ఎడమ కాల్వలకు 3 తడులు వారాబందీతో సాగునీటిని అందించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వారాబందీ విధానంతో ముందుకెళ్తున్నా ప్రాజెక్టులో కేవలం రెండున్నర టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో సమస్యను ఎలా అధిగమించాలనే ఆలోచనలో అధికారులు ఊగిసలాడుతున్నారు.

పొట్టదశలో వరిపైరు..

జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేలు, కుడి కాల్వ పరిధిలో 30 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం వరిపైరు పొట్ట దశలో ఉంది. అయితే ఈ నెల 31 నుంచి 4 రోజులపాటు మాత్రమే కాల్వలకు సాగునీటిని వదులుతామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్‌ చివరి నాటికి రెండు తడులైనా అందించాలని వేడుకుంటున్నారు. సకాలంలో వరిపంటకు నీరు అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఆయకట్టు రైతుల బాధను అర్థం చేసుకుని ఈ ఒక్క పంటకై నా పూర్తిస్థాయిలో సాగునీటిని వదలాలని కోరుతున్నారు.

జూరాలకు పూర్తిగా నిలిచిన వరద

ప్రాజెక్టులో కేవలం 2.862 టీఎంసీలు మాత్రమే నిల్వ

ఈనెల 31 నుంచి 4 రోజులు మాత్రమే చివరి తడి అందిస్తామని అధికారుల ప్రకటన

ఆందోళనలో ఆయకట్టు రైతులు

నవంబర్‌ వరకు సాగునీరు అందించాలని వేడుకోలు

కుడి, ఎడమ కాల్వల పరిధిలో 1.15 లక్షల ఎకరాల్లో వరిసాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement