జిల్లాలోని నాలుగు మిల్లుల్లో రూ.10 కోట్ల ధాన్యం మాయం
అక్రమార్కులు..
అధికారులు..
గద్వాల: అక్రమాలకు పాల్పడుతున్న రైస్‌మిల్లర్లపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తూ.. మింగిన ధాన్యాన్ని కక్కించే చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో నాలుగు రైస్‌మిల్లులో సుమారు రూ.10 కోట్ల ధాన్యం మాయం చేశారని గుర్తించి సదరు మిల్లులపై కేసులు నమోదు చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ శాఖకు ఆధారాలు ఇచ్చారు. అయితే కేసులు నమోదు చేసి అక్రమార్కుల నుంచి మాయమైన ధాన్యాన్ని రాబట్టాల్సిన జిల్లా అధికారులు మాత్రం మిల్లర్లతో చెట్టాపట్టాలేసుకుని పంచుకుతింటున్నారు. పైపెచ్చుగా ఈ ఖరీఫ్‌లోనూ ప్రభుత్వం నుంచి ధాన్యం పెట్టించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
అసలు చేసిందెవరంటే..
ఇటీవల జిల్లాలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం సరిపడా నిల్వలు ఉన్నాయా.. లేదా.. అని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అయిజలో ఏడుకొండల దేవుడి పేరిట ఉన్న ఓ మిల్లు, గద్వాల పట్టణంలో కృష్ణుడిపేరిట ఉన్న రైస్‌మిల్లు, మాజీ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన ఓ నాయకుడి పేరిట ఉన్న రైస్‌మిల్లు, గద్వాల మండలం కొత్తపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న మరో రైస్‌మిల్లులో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
కేసులు నమోదుకు సిఫారసు..
రూ.10 కోట్ల విలువ గల ధాన్యాన్ని మాయం చేసి అక్రమాలకు పాల్పడిన నాలుగు మిల్లులపై కేసులు నమోదు చేసి ఆర్‌ఆర్ యాక్టు కింద ధాన్యాన్ని రికవరీ చేయాలని గత నెల 23న జిల్లా సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు వివరాలు అందించారు. అయితే అధికారులు మాత్రం అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. వాస్తవానికి ప్రతినెలా మిల్లులు తనిఖీ చేసి ధాన్యం నిల్వలు సరిచూడాల్సిన అధికారులు.. అవినీతిపరులైన రైస్‌మిల్లులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే విజిలెన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఇచ్చినప్పటికీ జిల్లా అధికారులు తాత్సారం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో బేరసారాలు చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలరోజులైనా మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం.
‘కృష్ణా’లోకి మట్టి రోడ్డు!
అక్రమ ఇసుక రవాణా కోసం కృష్ణానది మధ్యలోకి వెళ్లేందుకు మట్టి రోడ్డు నిర్మించడం కలకలం రేపుతోంది.
–8లో u
రూ.60 కోట్లపైనే..
ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. మరోవైపు రైస్‌మిల్లర్లు మాత్రం సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో కలిసి యథేచ్ఛగా దోపిడికి పాల్పడుతున్నారు. ఇప్పుడు జిల్లాలో సరిగ్గా ఇదే జరుగుతుంది. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి కస్టమ్ రైస్ ఇవ్వాల్సిన కొందరు రైస్‌మిల్లర్లు నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమాలకు అడ్డువేయాల్సిన అధికారులు వారికే కొమ్ముకాస్తున్నారు. ఇది వరకే కేటీదొడ్డిలో సుమారు రూ.40 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించగా.. శాంతినగర్, కాకులారం, అయిజలో మరో రూ.13 కోట్ల విలువైన ధాన్యం మాయం చేసిన ఘటనలున్నాయి. వీటిపై అధికారులు ఆర్‌ఆర్ యాక్టు కింద కేసులు నమోదు చేసుకుని చేతులు దులిపేసుకున్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు
కేసులు నమోదు చేయాలని సివిల్ సప్లయ్ శాఖకు సూచన
ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న జిల్లా అధికారులు
ఆ ఇద్దరు అధికారులకు రూ.కోటి మామూళ్లు?
ఎవరినీ ఉపేక్షించం..
ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి రైస్ మిల్లర్లు కచ్చితంగా సీఎంఆర్ బియ్యం పెట్టాలి. ధాన్యాన్ని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పినట్లు విజిలెన్స్ నివేదిక వివరాలు తెలుసుకుని అవసరమైన చర్యలు చేపడుతాం. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు.
– రిజ్వాన్‌బాషాషేక్, కలెక్టర్


