గద్వాల వ్యవసాయం: వినూత్న పంటలతో ఆర్థికంగా ఎదిగేందుకు రైతు విజ్ఞాన యాత్రలు దోహదపడతాయని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు రైతుల మహారాష్ట్ర విజ్ఞాన యాత్రను కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఎదిగేందుకు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని చెప్పారు. రైతులు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫౌండేషన్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, నాందేడ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించి పంటల వైవిధ్యం, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్‌కుమార్, రాజశేఖర్, మహేష్, ఇమ్రాన్, వినీత్, రైతులు పాల్గొన్నారు.


