జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. సోమవారం స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదుకు సమయం తక్కువగా ఉన్నందున డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన వారికి రానున్న రోజుల్లో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.మైనార్టీ ప్రాంతాల్లో స్థానిక నాయకులు ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డివిజన్లు, వార్డులు, గ్రామాల వారీగా డిగ్రీ పూర్తి చేసిన వారి వివరాలు సేకరించి, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారా లేదా పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలుచుకోవాలన్నారు. ఏడాదిన్నర తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.


