అచ్చంపేట: శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ప్యూచర్‌సిటీ మీదుగా రూ. 4,621 కోట్లతో 41.5 కి.మీ. నిర్మించనున్న గ్రీన్ ఫీల్డు రేడియల్ రోడ్డుతో హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూర్, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. భారత్ ఫ్యూచర్ సిటీకి కీలక అనుసంధానంగా ఈ రోడ్డు నిలవనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 8 లేన్లకు విస్తరించే సదుపాయంతో పాటు మధ్యలో 20 మీటర్ల విస్తీర్ణాన్ని మెట్రో లేదా ఎంఎంటీఎస్ కారిడార్ నిర్మాణానికి ప్రత్యేకంగా కేటాయించారు. రేడియల్ రోడ్డు మార్గంలోనే ఇప్పుడు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు.
ప్రతిపాదిత రహదారిలో సర్వే..
ప్రభుత్వం ఆమనగల్ (ఆకుతోటపల్లి) నుంచి బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డు హైవేకు అలైన్‌మెంట్ కోసం ఆయా గ్రామాల సరిహద్దుల్లో భూముల సర్వే కూడా పూర్తయింది. చారకొండ మండలం జూపల్లి, తిమ్మాయిపల్లి, కమాల్‌పూర్‌తండా మీదుగా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి, కిష్టంపల్లి, తిరుమలగిరి, డిండి, ఉప్పునుంతల మండలం గువ్వలోనిపల్లి, అయ్యవారిపల్లి, రాయిచేడు, అచ్చంపేట మండలం హాజీపూర్, బ్రాహ్మణపల్లి శివారుల్లోని వ్యవసాయ పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డు రహదారి కోసం శాటిలైట్, డ్రోన్ సర్వే చేసి హద్దురాళ్లు పాతారు. ప్రస్తుతం ఉన్న శ్రీశైలం జాతీయ రహదారికి డిండి నుంచి అటు ఇటుగా ఎడమవైపు 500 మీటర్ల నుంచి కి.మీ. దూరంలో గ్రీన్‌ఫీల్డు హైవే కోసం సర్వే చేశారు. ఇక పిజికల్ సర్వే చేయాల్సి ఉంది.
గ్రీన్‌ఫీల్డు హైవేని కలుపుతూ..
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వరకు ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వేలైన్.. ఆమనగల్ – బ్రాహ్మణపల్లి మధ్య ప్రతిపాదిత నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డు హైవే పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్–బెంగుళూరు కారిడార్‌లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, నల్లమల (మన్ననూర్), సోమశిల వద్ద రైల్వేస్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పలుచోట్ల మార్కింగ్‌లు కూడా చేశారు.
ఆమనగల్ వద్ద ముగిసే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వరకు నాలుగు వరుసల విస్తరణలో నిర్మించాలని సర్కారు నిర్ణయించగా.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటి ప్రతిపాదనలో ఆమనగల్ రతన్ టాటా గ్రీన్‌ఫీల్డు హైవే నుంచి బ్రాహ్మణపల్లి వరకు 75.32 కి.మీ. ఉంటుంది. ఈ మార్గంలో గ్రీనన్‌ఫీల్డ్ (కొత్త రోడ్డు) 6.9 కి.మీ. ఇప్పటికే అభివృద్ధి చేసిన పాత రోడ్డు (బ్రౌన్ ఫీల్డు) 68.15 కి.మీ. నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. ఇది 20 గ్రామాల గుండా వెళ్తుంది.
రెండో ప్రతిపాదన ప్రకారం ఆమనగల్ నుంచి బ్రాహ్మణపల్లి వరకు 59.41 కి.మీ. రోడ్డు ఉంటుంది. ఈ విధానంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 46.7 కి.మీ., బ్రౌన్‌ఫీల్డ్ రోడ్డు 12.65 కి.మీ. చేపట్టాల్సి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే 11 గ్రామాల మీదుగా వస్తోంది.
మూడో ప్రతిపాదనలో 72.35 కి.మీ. ఉండనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి మీదుగా మొత్తం 15 గ్రామాల నుంచి వస్తోంది. ఈ మూడు ప్రతిపాదనల్లో కొత్త రోడ్డు నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండో ప్రతిపాదన మేరకు 13 నుంచి 16 కి.మీ. దూరం తగ్గడంతో పాటు యూటిలిటీ భారం తగ్గుతుందని, భూసేకరణ ఖర్చు కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. ఇదే తుది ప్రతిపాదనగా పేర్కొంటున్నారు.
ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ వరకు రవాణా సౌకర్యం
ఆమనగల్ నుంచి బ్రాహ్మణపల్లి మధ్య59 కి.మీ. నాలుగు వరుసల రహదారి
ఇదే దారిగుండా హైస్పీడ్ రైల్వేలైన్‌కు ప్రాథమిక అలైన్‌మెంట్
ప్రాథమిక సర్వే పూర్తి..
హద్దు రాళ్లు ఏర్పాటు


