గద్వాల: నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచి.. త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మా ట్లాడారు. భూసేకరణ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేనిచోట రైతులకు నిబంధనల మేరకు అవా ర్డు పాస్‌చేసి ముందుకెళ్లాలన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధిత రైతులతో గ్రామసభలు నిర్వహించి, ప్రాజెక్టు ఆవశ్యకతను తెలియజేసి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినందున అవసరమైన భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సమావేశంలో ఎస్‌డీసీ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్‌ఈ కేశవరావు, ఏడీ నూకరాజు ఉన్నారు.
నేడు ఢిల్లీకి కలెక్టర్
ఉత్తమ నీటి నిర్వహణ విధానాలపై ప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ మేరకు ఆయన గురువారం ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక సెషన్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమలుచేస్తున్న ఉత్తమ నీటి నిర్వహణ విధానాలు, అనుభావాలను తెలుసుకునే అవకాశం లభించనుంది. ఆయా ఉత్తమ పద్ధతులను జిల్లాలో పీఎండీడీకేవై ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్వయించుకునేందుకు ఉపయోగపడనుంది. జాతీయ స్థాయి వేదికపై ప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్‌కు లభించిన ఈ అవకాశంతో జిల్లాకు ప్రాధాన్యత ఏర్పడింది.


