జాయింట్‌ చెక్‌ పవర్‌ తొలగించండి | - | Sakshi
Sakshi News home page

జాయింట్‌ చెక్‌ పవర్‌ తొలగించండి

Sep 10 2026 12:57 AM | Updated on Sep 10 2026 12:57 AM

అలంపూర్‌: గ్రామ పంచాయతీల జాయింట్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొంగోళ్ల ఈశ్వర్‌ కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని సర్పంచులతో కలిసి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అప్పులుచేసి మరీ పనులు చేస్తున్నారన్నారు. అయితే జాయింట్‌ చెక్‌పవర్‌తో బిల్లులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు ఇప్పటికే చేసిన పనులకు తక్షణమే ఎంబీలు చేసి, జాప్యం లేకుండా బిల్లులు అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఎర్రమట్టి, ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామానికి ఆర్‌ఓ ప్లాంట్‌ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మద్దిలేటి, మహ్మద్‌ రఫీ, అడివప్ప, మోహన్‌గౌడ్‌, హరికృష్ణ, శ్రీనివాసులు, మహేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులు

సత్వరమే పూర్తిచేయాలి

గద్వాలన్యూటౌన్‌: ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌ వీరభద్రప్ప, కన్వీనర్‌ ఆలూరు ప్రకాష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బుదవారం కాళోజీ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్‌ ప్రాంతంలో పాలమూరు జలసాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌ను ఆధునికకీరించడంతో పాటు తుమ్మిళ్ల లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో భాగంగా ప్రతిపాదిత రిజర్వాయర్లను వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గట్టు ఎత్తిపోతల సామర్థ్యం పెంచి, సత్వరమే పూర్తి చేయాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి కాల్వలను ఏర్పాటుచేసి, పొలాలకు నేరుగా సాగునీరు అందేలా చూడాలన్నారు. జూరాల ప్రాజెక్టులో సిల్ట్‌ తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. డిండి లిఫ్ట్‌ పేరుతో జరుగుతున్న జలదోపిడీని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌ బాబు, అతికూర్‌ రహమాన్‌, రహమతుల్లా, మోహన్‌, శంకర ప్రభాకర్‌, తాహెర్‌, ఆనంద్‌, నాగార్జున గౌడ్‌, భీమన్న, కృష్ణయ్య పాల్గొన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

ఎంఈఓపై సస్పెన్షన్‌ వేటు

రాజోళి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓ నర్సింహులును సస్పెన్షన్‌ చేసినట్లు డీఈఓ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. వడ్డేపల్లి మండలం రామాపురంలోని విజ్ఞాన్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ అనుమతి రద్దయినా విద్యార్థుల వివరాలు, తదితర రికార్డులు స్వాధీనం చేసుకోలేదని.. ఈ విషయంపై ట్రెయినీ కలెక్టర్లతో కలిసి గ్రామంలో విచారణ చేశామన్నారు. మరో ప్రైవేటు పాఠశాల కూడా అనుమతి లేకుండా నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓ నర్సింహులును సస్పెన్షన్‌ చేసినట్లు డీఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement