చోరీ ఘటనలు ఇలా..
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా నిందితుల చేతివాటం
నిఘా పెట్టాం..
గద్వాల క్రైం: తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు.. ఇంట్లో దాచ్చుకున్న నగదు, బంగారు ఆభరణాలు, వెండి ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు. గ్రామం, పట్టణం తేడా లేకుండా అందిన కాడికి దోచుకుంటూ ఇల్లు గుళ్ల చేస్తున్నారు. అయితే జిల్లాలో వరుస చోరీల సంఘటనలకు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో వరుస చోరీల పరంపర కొనసాగుతోంది. గడిచిన రెండు నెలల్లోనే జిల్లాలో 30కిపైగా చోరీలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. నిమిషాల వ్యవధిలోనే తమ పని కానిస్తూ.. పోలీసు శాఖకు దొంగల ముఠా సవాల్ విసురుతోంది. మరోవైపు సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు అనుమానితుల వివరాలు సేకరిస్తూ కూపీ లాగుతున్నారు.
జిల్లాలోని వరుస చోరీ ఘటనలపై పోలీసులు సైతం నిర్విరామంగా కేసుల ఛేదనలో వ్యూవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని జమ్మిచేడ్‌కాలనీలో తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన మహారాష్ట్రకు చెందిన నిందితుడిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకుని బంగారం రికవరీ చేశారు. అలాగే భీంనగర్‌కాలనీలోని నివాసం ఉంటున్న కారు డ్రైవర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి, రూ.7 వేల నగదును అపహరించారు. పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని ఎత్తుకెళ్లిన మొత్తం బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన నిందితులుగా పోలీసులు గుర్తించారు. కేసులను సవాల్‌గా తీసుకుని గుర్తుతెలియని దుండగులను కట్టడి చేస్తున్నారు. అయినప్పటికీ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల వ్యవధిలో 17 చోరీల కేసులు నమోదు కాగా మరో 13 ద్విచక్రవాహనాల అపహరణ కేసులు నమోదవడం గమనార్హం.
గద్వాల మండలంలోని తుర్కోనిపల్లిలో చోరీ ఘటనపై వివరాలు సేకరిస్తున్న
క్లూస్ టీం సభ్యులు (ఫైల్)
3.7.2026 వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నందనవనం కాలనీకి చెందిన రైతులు వ్యవసాయ సాగు అవసరాల కోసం 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్, కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత రైతులు శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2.8.2026న గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలోని మునేశ్వరి ఉదయం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి రూ.3.5 లక్షల నగదు, 7 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితురాలు గట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
3.8.2026న గద్వాల మండలంలోని తుర్కోనిపల్లి గ్రామానికి చెందిన బొగ్గు మహేశ్వరమ్మ ఇంటికి తాళం వేసి గద్వాలకు వచ్చారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, రూ.10 వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల మధ్యలోనే జన సంచారం ఉన్న కాలనీలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దుండగులు ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాహనాలు సైతం ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పోలీసు శాఖపై పెద్దఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న జిల్లావాసులు
అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలం
జిల్లాలో జరుగుతున్న చోరీల ఘటనలపై ఇప్పటికే ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టాం. అలాగే సరిహద్దు ప్రాంతాల వద్ద పటిష్ట తనిఖీలు చేపడుతూ.. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ఆలయాలు, నివాస గృహాలు, పార్క్ చేసిన వాహనాలు అపహరించిన కేసులపై క్లూస్ టీం, ప్రత్యేక బృందాల సభ్యులు దృష్టిసారించాయి. విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను వీలైనంత త్వరగా ఛేదిస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ


