గద్వాల: విద్యార్థుల సమగ్ర వికాసానికి, భవిష్యత్ పునాదులకు చదువే కీలకం అని, పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి.. జిల్లా ర్యాంకును ముందుకు తీసుకురావడానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా ప్రయోగపూర్వకంగా బోధనా పరికరాలు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తు పాఠాలు చెప్పాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రాముఖ్యతను గుర్తించి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలో ప్రవేశాలు పెంచాలని, యూడైస్ వివరాలు, పోషణ్ యాప్ నమోదు పక్కాగా ఉండాలని ఆదేశించారు. పాఠశాలలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు తప్పనిసరి అని, అవసరమైన చోట విద్యా వలంటీర్లను నియమించి మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర పరిశీలకులు అభిషేక్, డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


