కేటీదొడ్డి: ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనులు చేయాలని శిక్షణ కలెక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని నందిన్నె గ్రామాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామంలోని విద్యార్థులు, యువత కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని, స్ధానిక యూపీఎస్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీ కాలనీలో నూతన అంగన్‌వాడీ కేంద్రం, ఉన్నత విద్య కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల, గ్రామ పాలన సౌకర్యార్థం, నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం శిక్షణ కలెక్టర్ మాట్లాడుతూ వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచు నాగమ్మ పాల్గొన్నారు.
రోగులకు నాణ్యమైన వైద్యసేవలు
అలంపూర్: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సంధ్య కిరణ్మయి వైద్యులకు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని ఏరియా (వంద పడకల) ఆస్పత్రిలో గురువారం కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఎంహెచ్‌ఓ సంధ్య కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని, గర్భిణుల ఆరోగ్య పరీక్షలు, సురక్షితమైన ప్రసవాలు చేయాలని సూచించారు. బాలింతలు, చిన్నారులకు వైద్య పరీక్షలు మెరుగుపర్చాలని కోరారు. యుక్త వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించే ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్ధేశకాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పీహెచ్‌సీలు అనుబంధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓను వైద్యులు శాలువాతో సత్కరించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి ప్రసూనరాణి, కిషోర్, సివిల్ సర్జన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
23న కబడ్డీ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా సీనియర్ మహిళా జట్టు ఎంపికను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని వారు కోరారు.


