గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Aug 21 2026 12:28 AM | Updated on Aug 21 2026 12:28 AM

మక్తల్‌: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నియోజకవర్గంలో రూ.178.84 కోట్లతో 25 అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మండలంలోని కాచ్‌వార్‌ టోల్‌గేట్‌ వద్ద పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికి బైక్‌ ర్యాలీగా నల్లజానమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆమెను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి మంత్రి వాకిటి శ్రీహరి ఇంటికి చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వాకిటి తల్లి రాములమ్మను సీతక్క శాలువాతో సన్మానించారు. అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి 25 ఏళ్లు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా దంపతులను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి ద్వారక ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

సీడీ విడుదల..

మక్తల్‌ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన సీడీని మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తన రాజకీయం 2001, ఆగస్టు 20న మక్తల్‌ సర్పంచుగా ప్రారంభమైందన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తల అండదండలతో నేడు ఈ స్థాయికి ఎదిగానని.. కార్యకర్తలే దేవుళ్లని.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. మక్తల్‌, ఆత్మకూర్‌, నర్వ, మాగనూర్‌, అమరచింత మండలాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఊట్కూర్‌ మండంల మల్లేపల్లి వంతెన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేశామని పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు.

రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు..

స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం వైస్‌ చైర్మన్‌ నాగరాజు, పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస, బీకేఆర్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ రహమతుల్లా, మక్తల్‌ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ గవినోళ్ల రాధమ్మ, నాయకులు పోలీస్‌ చంద్రశేఖర్‌రెడ్డి, గణేష్‌కుమార్‌, రవికుమార్‌యాదవ్‌, కోళ్ల వెంకటేష్‌, రవికుమార్‌, శివరాంరెడ్డి, ఆనంద్‌గౌడ్‌, చంద్రకాంత్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement