గద్వాల న్యూటౌన్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హన్మంతునాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లాకేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. పాతబస్టాండ్, ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన జీఓ 8ని న్యాయస్థానం నిలిపివేయడం వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పాటైన వెంటనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. రూ.51 వేల సహాయంతో మొదలై.. రూ.1,00,116 పెంచారని, బీఆర్‌ఎస్ హయాంలో 13 లక్షల మందికి రూ.13 వేల కోట్ల మేర సాయం అందిందని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలపాటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి జీఓ 8పై ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి ద్వారా ఇచ్చే నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు మొత్తానికే ఎగ్గొట్టే కుట్రకు తెరలేపారని విమర్శించారు. పథకాలను మళ్లీ అమలు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కోటేష్, రాఘేంద్రరెడ్డి, ప్రతాప్, శ్యామల పాల్గొన్నారు.


