తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

గట్టు: తల్లిపాలతో బిడ్డకు కావాల్సిన రోగనిరోధక శక్తి లభిస్తుందని ట్రెయినీ కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం గట్టు రైతువేదికలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్‌ మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం అత్యంత కీలకమన్నారు. మొదటి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా వంటిదని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయొద్దని సూచించారు. గర్భిణులు క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి నెలవారీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ఐసీడీఎస్‌, వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సునంద, ఎంపీడీఓ చెన్నయ్య, సీడీపీఓ ఆకాశదీప్తి, డీసీపీఓ నర్సింహ, సర్పంచ్‌ నాగరాజు, సూపర్‌వైజర్‌ వాసంతి, కృష్ణవేణి, వల్లి పాల్గొన్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలని హైకోర్టు జడ్జికి పోస్టుకార్డు

గట్టు/కేటీదొడ్డి: మండలంలోని పెంచికలపాడుకు చెందిన 35 మంది విద్యార్థులు ఆరగిద్ద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. పెంచిలకపాడు నుంచి ఆరగిద్దకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 10 కి.మీ. నడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తమకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం హైకోర్టు జడ్జికి పోస్టుకార్డు రాశారు.

● కేటీదొడ్డి మండలం పాగుంట విద్యార్థులు సైతం తమ సమస్యలపై హైకోర్టు జడ్జికి పోస్టుకార్డులు పంపించారు. గ్రామంలో 7వ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం 16 కి.మీ. దూరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అయితే సమయానికి బస్సులు లేకపోవడంతో చదువుకు దూరమయ్యే పరిస్ధితి నెలకొందని వాపోయారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తే మరింత మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement