నారాయణపేటలో 1900 సంవత్సరం నుంచే ఇక్కడి చేనేత కుటుంబాలు మగ్గాలపై పట్టు చీరులు నేస్తూ వస్తున్నారు. తరం మారినా.. మగ్గం మారలేదు. డిజైన్‌న్ మారినా.. నాణ్యత తగ్గలేదు. అగ్గిపెట్టలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఉంది. మగ్గంపై నేతన్న నేసిన చీర దేశ ప్రధాని ఒంటిపై మెరిసింది. 1983లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ‘పేట’ చీరను కట్టుకున్నారంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. నారాయణపేట, జాజాపూర్, కోటకొండలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వీరు కాలం మారినా మహిళల అభిరుచులకు తగ్గట్లు చీరలు డిజైన్ చేస్తున్నారు. టెంపుల్, చెక్స్, ప్లెయిన్, బార్డర్, బుట్టా, ఫుల్ టర్నింగ్ తదితర డిజైన్లలో చీరలను రూపొందిస్తున్నారు. 2015లో నారాయణపేట చేనేత జియోగ్రాఫికల్ పేటెంట్ హక్కు సంపాదించుకుంది. ఇక్కడ నేసిన చీరలు హైదరాబాద్, బెంగళూరు, రాయచూర్, కలబురగి, యాద్గిర్, ముంబయి, పుణె, సోలాపూర్, సాంగ్లీ, నాగ్‌పూర్, అహ్మదాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఢిల్లీలోనూ పేట పట్టుకు మార్కెట్ ఉండటం విశేషం.


