జిల్లాలో విస్తరిస్తున్న ఉద్యాన పంటలు
గద్వాల వ్యవసాయం: జిల్లాలోని నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఉద్యాన పంటల సాగు ఏటా పెరుగుతోంది. కూరగాయలు, ఎండుమిర్చిలకు తోడు ఏటా కొత్తగా పండ్ల తోటలు, ఆయిల్‌పాం తదితర పంటలపై ఇక్కడి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించిన పథకాలకు డిమాండ్ మేరకు నిధులు మంజూరు చేస్తే ఉద్యాన పంటల సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
నేలలు, వాతావరణం
జిల్లాలో ఉద్యాన పంటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, ఆయిల్‌పాం, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతోపాటు నెట్టెంపాడు ఎత్తిపోథల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా ఉద్యాన పంటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణ విషయానికి వస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఏడాది పంటల విస్తీర్ణం
2019– 20 52,172
2020– 21 53,500
2021– 22 54,200
2022– 23 58,000
2023– 24 72,800
2024– 25 49,500
2025– 26 55,500
ఏటేటా పెరుగుదల..
నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఏటా ఉద్యాన పంటల సాగు పెరుగుతోంది. ప్రతి ఏడాది రైతులు కొత్తగా పండ్లు, ఆయిల్‌పాం తోటలు వేస్తున్నారు. ఇక కూరగాయల విషయానికి వస్తే ఎండుమిర్చి, ఉల్లితోపాటు వంకాయ, బీర, కాకర, టమాట, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పచ్చిమిర్చి, సోరకాయ తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈఏడాది వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలు కొంత ఉద్యాన పంటలను దెబ్బతీసినప్పటికీ సాగు బాగా జరిగింది. వానాకాలం సీజన్‌లో కూరగాయల సాగు కొంత తగ్గినా.. యాసంగిలో పెరిగింది. ఎండుమిర్చి సాగు కొంత తగ్గింది. ఆయిల్‌పాం సాగుసైతం ఆశించిన స్థాయిలో సాగుతోంది. పలు పంటల్లో అంతర్ పంటల సాగుగా ఉద్యాన పంటలను ఇక్కడి రైతులు వేస్తున్నారు.
గడిచిన ఐదేళ్లలో ఉద్యాన పంటల సాగు ఇలా (ఎకరాలలో)..
పండ్లు, ఆయిల్‌పాం సాగుౖపైరెతుల ఆసక్తి
విస్తారంగా కూరగాయల తోటలు
గతేడాది తగ్గినా..ఈసారి పెరిగిన సాగు
ప్రోత్సహిస్తే మరింత మంది ముందుకు..
ఆశించిన స్థాయిలో సాగు..
ఉద్యానవన పంటలకు జిల్లా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు ఉన్యాన పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎండుమిర్చి సాగు ఈ ఏడాది కొంత తగ్గింది. ఆయిల్‌పాం సాగు ఆశించిన స్థాయిలో ఉంది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నాం.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి


