భక్తిశ్రద్ధలతో ఉగాది పండుగ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఉగాది పండుగ

Mar 20 2026 9:26 AM | Updated on Mar 20 2026 9:26 AM

గద్వాల న్యూటౌన్‌: తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను జిల్లావాసులు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శ్రీపరాభవసు నామ సంవత్సరం తీపి, చేదు అనుభవనాలను మరిచి ఘన స్వాగతం పలికారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామాల్లో వేకువజామునే చేలకు చేరిన అన్నదాతలు దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త దుస్తులు ధరించి నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని దేవుడిని ప్రార్థించారు. పండితులు పంచాగ శ్రవణాలు చదువుతూ జిల్లా భవిష్యత్‌ను వివరించడంతోపాటు ప్రజలు తమతమ రాశి ఫలాలు, జాతక చక్రాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని సుంకులమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాలను భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే క్యూలైన్‌లలో బారులుదీరారు. ఆలయాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.

సిరిసంపదలు కలగాలని..

గ్రామాల్లో రైతులు వేకువజామునే చేలకు వెళ్లి అరక పూజలు చేసి.. నాగలి తోలి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గోవులను అలకరించి పూజలు చేసి పొలాల్లో ఐదుసార్లు నాగిలిసాళ్లు పట్టించారు. ఇలా చేయడం వల్ల పాడి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. చిరుధాన్యాలను పొలాల్లో చల్లి దేవుడికి కొబ్బరికాయ కొట్టి, నైవేద్యం పెట్టారు. వివిధ కులవృత్తుల వారు వస్తువులకు, పరికరాలకు పూజలు చేశారు.

ఆటంకం లేకుండా గ్యాస్‌ సరఫరా : కలెక్టర్‌

గద్వాల: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగదారులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ఒకసారి గ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌ చేసుకున్న తర్వాత సిలిండర్‌ బుకింగ్‌ కోసం కనీసం 45 రోజుల వ్యవధి ఉంటుందన్నారు. ఈ కాల పరిమితిలోపు బుకింగ్‌ చేయడానికి అనుమతి ఉండదన్నారు. 45 రోజుల వరకు సిలిండర్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వినియోగదారులు తమ గ్యాస్‌ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే బుకింగ్‌ చేయాలన్నా రు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే 1906 టోల్‌ఫ్రీకు గాని, సెల్‌ నం.90103 10309కు ఫిర్యా దు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement