బీచుపల్లి ఆయిల్ మిల్లులో సివిల్ పనుల జోరు
ఎర్రవల్లి: జిల్లాలోని ఆయిల్‌పాం రైతులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలోని పాత విజయ ఆయిల్ మిల్లులో చేపట్టిన సివిల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 95.20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 47కోట్ల వ్యయంతో మిల్లు నిర్మించేందుకు తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. మిల్లులో సివిల్ పనులు పూర్తయిన వెంటనే టెక్నికల్, రిఫైనరీ మిషన్ ఫిట్టింగ్ తదితర పనులు ప్రారంభించనున్నారు. త్వరలో మిల్లును రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆయిల్‌పాం సాగుపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో ఆయిల్‌పాం సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మన ఊరు – మన ఆయిల్‌పాం – మన భవిష్యత్ అనే నినాదంతో ఉద్యాన, వ్యవసాయశాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,751 మంది రైతులు దాదాపు 7200 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగుచేస్తున్నారు. ఈ ఏటా మరో 471 ఎకరాల్లో సాగు చేసేందుకు కసరత్తు చేపట్టారు. ఆయిల్‌పాం క్రషింగ్ మిల్లు అందుబాటులోకి వస్తే.. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దళారుల బెడద లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం లభిస్తుంది.
టన్ను ధర రూ.21,546
గతంలో ఒక టన్ను ఆయిల్‌పాం ధర రూ. 20,450 ఉండగా.. ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రూ. 21,546 మద్దతు ధరను ప్రకటించింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నాలుగేళ్లలో తోటల నుంచి ఎకరాకు సగటున 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. రవాణా ఖర్చులు తగ్గించేందుకు శాంతినగర్ సమీపంలో వెంకటపురం స్టేజీ, ధరూర్ మండలంలో కూడా గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు. బీచుపల్లి ఆయిల్ మిల్లు అందుబాటులోకి వస్తే.. జిల్లా ఆయిల్‌పాం సా గులో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది.
రూ. 47కోట్లతో కొనసాగుతున్న మిల్లు నిర్మాణం
త్వరలోనే ఏర్పాటుకానున్న రిఫైనరీ మిషన్లు
జిల్లాలో 7,200 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం
ఆర్థికంగా అభివృద్ధి చెందనున్న రైతులు


