గద్వాల: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 8,110మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలన్నారు. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
వెల్ఫేర్ బోర్డుతోనే పథకాలు అందించాలి
గద్వాల: కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ, కార్యదర్శి వీవీ నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఏఓ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక సంక్షేమ బోర్డు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం వల్ల అర్హులైన కార్మికులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే పథకాలు అందించాలని వారు కోరారు.
వేరుశనగ క్వింటా రూ.8,006
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శుక్రవారం 1,129 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,006, కనిష్టంగా రూ. 3,219, సరాసరి రూ. 6,020 ధర పలికింది. అదే విధంగా 56 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,171, కనిష్టంగా రూ. 2,119, సరాసరి రూ. 6129 ధరలు వచ్చాయి. 19 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 7,129, కనిష్టంగా రూ. 2,003, సరాసరి రూ. 7,029 ధరలు పలికాయి.


