● అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల: ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేసి.. కనీసం 85 శాతం పురోగతి సాధించాలని సూచించారు. అదే విధంగా భూభారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కుల, ఆదాయ ఎఫ్–లైన్ పిటీషన్లు ఇతర ధ్రువపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలన్నారు. సర్వేయర్లపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని.. సర్వేయర్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని అన్నారు. జనాభా గణన–2027 పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 12న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బాధ్యతతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.
పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని.. అందులో భాగంగానే గేదెల కొనుగోలుకు సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మినీ డెయిరీ పథకానికి ఎంపికై న 44 మంది రైతులు గేదెల కొనుగోలు నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు బయలుదేరారు. వీరి బస్సును కలెక్టరేట్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారి నుషిత పాల్గొన్నారు.


