కేంద్ర మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి అలంపూర్ ఆలయాల సందర్శనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఆలయాలకు వెళ్లే రహదారిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, తీగలు ఏమైనా ప్రమాదకరంగా ఉంటే వాటిని సరిచేయించాలని సూచించారు. అలంపూర్ పట్టణ ప్రధాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పురపాలక సంఘం అధికారులకు చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఇతర అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి పర్యటనలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నియమిస్తున్నామన్నారు. పోలీసుల గౌరవ వందనం తమ శాఖ నుంచి చేయాల్సిన ఇతర అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


