అమ్మ భాషలోనే మధురానుభూతులు
గద్వాల న్యూటౌన్: అనుభూతుల్ని అమ్మ భాషలో చెప్పినంత గొప్పగా ఇతర భాషల్లో చెప్పలేరని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లి బడిలో ఉంటూ.. తల్లిపాల ద్వారా నేర్చుకునేటటువంటి భాష మాతృభాష అని చెప్పారు. వ్యక్తిత్వ వికాసం మాతృభాష ద్వారానే కలుగుతుందన్నారు. మాతృభాషను ప్రేమిస్తూ.. పరభాషలను గౌరవించాలని సూచించారు. పఠనాభిలాషపై ఆసక్తి పెంచుకుంటే మాతృభాషపై పట్టు సాధించడమే కాకుండా.. విస్తృత జ్ఞానాన్ని కూడా పొందవచ్చని పేర్కొన్నారు. మాతృభాష గొప్పతనం, సాహిత్యం గురించి వివరించారు. ప్రిన్సిపాల్ షేక్ కలంధర్ భాష మాట్లాడుతూ మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా, ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. మాతృభాషల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 21న యునెస్కో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా 1999లో ప్రకటించిందని చెప్పారు. సమావేశం అనంతరం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100 మంది ఆంధ్ర కవుల ఫొటో ఎగ్జిబిషన్‌ను అదనపు కలెక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు సందర్శించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సురేందర్‌రెడ్డి, డాక్టర్ సత్తన్న, డాక్టర్ సత్తెమ్మ, నాగభూషణం, శంకర్, వెంకటేశ్వర్లు, రాములు, మల్లికార్జున్‌గౌడ్, మహమ్మద్ రఫిక్, వాయిద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు గురుకులాల
ప్రవేశ పరీక్ష
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో రెగ్యులర్ పరీక్ష, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్ పొందలేని విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా తీసుకోవాలని, హాల్‌టికెట్‌లో వివరాలు తప్పుగా ఉంటే సంబంధిత సర్టిఫికెట్లతో పరీక్ష కేంద్రం వద్దకు తీసుకురావాలని గద్వాల జోనల్ అధికారి విద్యుల్లత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుంది. గంట ముందుగానే కేంద్రం వద్దకు చేరుకోవాలని, పరీక్షకు హాల్‌టికెట్, బ్లాక్ పెన్ను, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. ఇందులో మెరిట్ వచ్చిన విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హాజరుకానున్న 31,804 మంది విద్యార్థులు
ఆన్‌లైన్‌లో అందుబాటులో హాల్‌టికెట్లు


