కుష్టు నిర్మూలనకు స్పర్శ
●
అవగాహన కల్పించాం..
కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నాం. జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. వ్యాధి లక్షణాలుంటే సమీప పీహెచ్‌సీకి వెళ్లి పరీక్షలు చేసుకోవాలి. ఇక వ్యాధి నిర్ధారణ అయితే మందులు వాడాలి. ప్రతి పీహెచ్‌సీలో నోడల్ అధికారి పర్యవేక్షణ ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు మందులు ఉచితంగా అందజేస్తుంది. జిల్లాలో ప్రస్తుతం 45 కేసులున్నాయి. 2027 నాటికి కుష్టు రహిత జిల్లాగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
– కిరణ్మయి, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి
గద్వాల క్రైం: కుష్టువ్యాధి సంపూర్ణ నిర్మూలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2027 నాటికి దేశంలో ఈ మహమ్మారిని పూర్తిగా అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొదించింది. ఈ మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గత నెలలో జిల్లావ్యాప్తంగా 15 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా 13 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వ్యాధిపై విస్తృతంగా అవగాహన సదస్సులు చేపట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కుష్టువ్యాధి పక్షోత్సవాల్లో భాగంగా గత నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ పేరిట లెప్రసీ అవగాహన కార్యక్రమాలు పూర్తిచేశారు. పాఠశాల, ఆంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాల్లో వ్యాధి గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం కల్పించారు.
13 కేసుల గుర్తింపు..
కుష్టువ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే జిల్లాలో జనవరి 17 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టిన నేపథ్యంలో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం 45 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. అలాగే జనవరి 30 నుంచి ఈ నెల 13 వరకు కుష్టు నివారణ పక్షోత్సవాలు నిర్వహించారు.
వ్యాధి లక్షణాలు ఇలా..
కుష్టువ్యాధి లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపు, ఛాతిపై నొప్పిలేని బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడక పోవడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు రావడం, అరచేతులు, అరికాళ్లలో బొబ్బలు రావడం, చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు. ఈ వ్యాధి నొప్పి లేనిది కావడం వలన సమాజంలో దాగి ఉన్న కేసులను గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స అందించడం వల్ల అంగవైకల్యాన్ని అరికట్టవచ్చు.
పల్లీ @ రూ.8,706
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 449 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.8,706, కనిష్టంగా రూ.5,671, సరాసరిగా రూ.8,019 ధరలు లభించాయి. అలాగే 47 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.7,101, కనిష్టంగా రూ.6,689, సరాసరిగా రూ.7,089 చొప్పున వచ్చాయి. 50 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ.6,169, కనిష్టంగా రూ.2,319, సరాసరిగా రూ.6,169 చొప్పున పలికాయి.
జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు
రోగుల నిర్ధారణపై ప్రత్యేక సర్వే
బాధితులకు ఉచితంగా మందుల పంపిణీ
జిల్లాలో ముగిసిన పక్షోత్సవాలు
కుష్టు నిర్మూలనకు స్పర్శ


