రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా జిల్లా క్రీడాకారుడు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా జిల్లా క్రీడాకారుడు

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా జిల్లా క్రీడాకారుడు

రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా జిల్లా క్రీడాకారుడు

గద్వాలన్యూటౌన్‌: రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా జిల్లాకు చెందిన క్రీడాకారుడు రాజు ఎంపికయ్యారు. గత డిసెంబర్‌ 25 నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్‌ కబడ్డీ టోర్నీలో జిల్లా జట్టు తరఫున ఆడిన రాజు.. అత్యుత్తమ ప్రతిభకనబర్చడంతో గుజరాత్‌ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో ఆడే తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డీకే స్నిగ్దారెడ్డి, సెక్రెటరీ నర్సింహ, ట్రెజరర్‌ చందు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రవి, సభ్యులు నగేశ్‌, వెంకటేశ్‌, జగదీశ్‌, పీడీ రాజేందర్‌, పీఈటీ పాషా హర్షం వ్యక్తంచేశారు.

నేటి నుంచి న్యాయవాదుల పాదయాత్ర

అలంపూర్‌: న్యాయవాదుల రక్షణ చట్టం అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ అలంపూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను సోమవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం గతేడాది నవంబర్‌ 9న పాదయాత్ర చేపట్టగా.. 14వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌కు చేరిందన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాసరెడ్డి సంఘీభావం ప్రకటించి.. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో భూత్పూర్‌ వద్ద పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తిరిగి భూత్పూర్‌ నుంచి పాదయాత్ర పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం నెలకొంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 84 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 31,804 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 30,650 మంది విద్యార్థులు హాజరయ్యారు. జోగుళాంబ గద్వాల జోనల్‌ అధికారిని విద్యుల్లత పలు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల, గద్వాల జిల్లా ధరూల్‌లో ప్రశ్నపత్రం తారుమారు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ప్రశ్నపత్రాలు తెప్పించి మధ్యాహ్నం తర్వాత పరీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement