మహిళల ప్రగతి చక్రం
10 డిపోల పరిధిలో..
● ఆర్టీసీ బస్సులతో
మహిళా సమాఖ్యలకు భారీ ఆదాయం
● ఈఎంఐలు సకాలంలో
చెల్లింపుతో సభ్యుల ఊరట
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
32 బస్సుల కొనుగోలు
అచ్చంపేట: మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తిని కేటాయించడంతో ఆర్టీసీ బస్సుల ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. ఇప్పుడు మహిళా సమాఖ్యల ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులను అప్పగించిన మహిళా సమాఖ్యలకు యాజమాన్యం క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తుండటంతో ఈ పథకం ద్వారా మహిళా సభ్యులకు మంచి ఫలితాలు అందుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టగా.. గతంలో రెండు నెలల అద్దెలు విడుదల కాగా.. ఇటీవల ఆరు నెలల అద్దెలను ఆర్టీసీ యాజమాన్యం మహిళా సమాఖ్యలకు చెల్లించింది.
నెలకు రూ.69,468 ఆదాయం
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 32 మండలాల మహిళా సమాఖ్యలకు చెందిన 32 బస్సులను 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఈఎంఐ (అద్దె రూపంలో ఆదాయం అందుతోంది. గత ఆరు నెలల కాలానికి గాను ప్రతి మండల సమాఖ్య ఖాతాలో రూ.4,16,808 జమ అయ్యాయి. మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడి పెట్టగా.. ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షల వరకు వెచ్చించింది. మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించిన బస్సులకు ప్రతినెలా సంస్థ సంబంధిత మహిళా సమాఖ్యలకు అద్దెలు చెల్లిస్తోంది. గత ఆరు నెలల కాలానికి ఆర్టీసీ జిల్లాకు సంబంధించి మొత్తం 32 బస్సులకు గాను రూ.1,33,37,856 చెల్లించింది.
84 నెలలపాటు ఒప్పందం
ఇది బ్యాంకు రుణం కాదని, ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అందజేసిన ఒక గొప్ప ఆర్థిక అవకాశం అని ఆధికారులు పేర్కొంటున్నారు. 84 నెలల ఒప్పందం ముగిసిన తర్వాత ఈ బస్సులను తిరిగి సంఘాలకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఈ ఆదాయం మహిళా సమాఖ్యల బలోపేతానికి, మండల స్థాయిలో సామాజిక కార్యక్రమాలకు ఎంతో దోహదపడనుంది. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన అద్దెలను చెల్లించడంతో జిల్లాలోని మహిళా సమాఖ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అప్పగించడం ద్వారా తాము యజమానులం కాగలిగామని, ఇది తమ ఆర్థిక ఎదుగుదలకు మరో అడుగుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందిరా మహిళా శక్తి కింద ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మండల మహిళా సమాఖ్యల ఆర్టీసీ బస్సులు 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ఇందులో అచ్చంపేట డిపోలో 2, గద్వాలలో 4, కల్వకుర్తిలో 2, కొల్లాపూర్‌లో 2, కోస్గిలో 1, మహబూబ్‌నగర్‌లో 5, నాగర్‌కర్నూల్‌లో 2, నారాయణపేటలో 3, షాద్‌నగర్‌లో 4, వనపర్తిలో 7 చొప్పున ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)కు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం 64 బస్సుల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 32 బస్సులు కొనుగోలు చేసి మహిళా సమాఖ్యలకు అందజేసింది. ప్రభుత్వం మహిళా సంఘాలకు బస్సుల కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వగా.. రూ.9.60 కోట్లతో ఇప్పటి వరకు 32 బస్సులు మహిళా సంఘాల ద్వారా సమకూర్చారు. వీటిలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని వంగూరు, పెద్దకొత్తపల్లి, తిమ్మాజిపేట, బల్మూర్, ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మండల సమాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున 7 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షల చొప్పున నిధులు సమకూర్చారు. వీటిలో మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు చెల్లించగా.. ప్రభుత్వం రూ.30 లక్షలను సీఏఎఫ్ (క్రెడిట్ ఆవిడంట్ ఫండ్)గా మంజూరు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండల సమాఖ్యలకు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారితకు పటిష్టమైన పునాదులు పడుతున్నాయి.


