ప్రధానంగా అమాత్యుల ఇలాకాల్లోనే..
ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ప్రధానంగా అమాత్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాలతోపాటు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వికృత రాజకీయ పోకడలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో పల్లె పోరులో కాంగ్రెస్ పైచేయిగా నిలిచినప్పటికీ, బీఆర్‌ఎస్, బీజేపీ సత్తా చాటడంతో ‘అధికార’ నాయకుల వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. పురంలో గెలుపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు ఒక్కదాని వెనుక ఒకటిగా చోటుచేసుకుంటున్న పలు ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయని సీనియర్ రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు వ్యాప్తంగా మక్తల్ మంటలు చెలరేగుతున్నాయి. పుర ఎన్నికల వేళ ఆ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతోపాటు ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ పోరు క్రమంలో చోటుచేసుకున్న పలు ఘటనలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఖద్దరు చేతిలో ఖాకీలు బంధీలయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ.. వారి ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లిలో నెలకొన్నట్లు సమాచారం.
మక్తల్‌లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యతో రాజకీయ దుమారం
తెరపైకి కోస్గిలో కౌన్సిలర్ ఆశావహులపై బెదిరింపుల పర్వం
మహబూబ్‌నగర్‌లో పోలీసుల డేగకన్నుతో ప్రతిపక్ష అభ్యర్థుల కట్టడి
కొల్లాపూర్, అలంపూర్‌లో సైతం ఇవే పరిస్థితులు
ఎన్నికల కమిషన్‌కు అందిన ఫిర్యాదు


