రండి ఓటేద్దాం
నేడే పురపాలిక ఎన్నికల పోలింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ /సాక్షి, నాగర్‌కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
బరిలో 1,573 మంది అభ్యర్థులు..
ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్‌కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్‌గా విక్రం (బీఆర్‌ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్‌లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్‌లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు.
● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు
ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
మహబూబ్‌నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం
బీజేపీ అభ్యర్థి మృతితోమక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా
మిగిలిన 373 వార్డులు/డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో..
పోలింగ్‌కేంద్రాల్లో
వెబ్‌కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన
అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణ..
మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్‌కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్‌బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్‌కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది.
రండి ఓటేద్దాం
రండి ఓటేద్దాం
రండి ఓటేద్దాం


