పల్లెలు కలవరింత.. | - | Sakshi
Sakshi News home page

పల్లెలు కలవరింత..

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

పంటలు పండడం లేదు.. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా.. మా చెరువులోకి కాల్వ తీస్తే ఊరుకోం.. చితికిపోతున్న 5 గ్రామాలు..

పోలేపల్లి సెజ్‌ పరిసర ప్రాంతాల దీనగాధ

విద్యార్థుల పాలిట ‘కాలకేయుడి’లా..

కాలుష్యం కుమ్మరింత..

కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి.

– కిష్టారం మల్లేష్‌ గౌడ్‌, రైతు, రాయపల్లి

మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయికాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్‌ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా.

– పాలెం శ్రీనివాస్‌ రైతు

మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. గతంలో పొల్యుషన్‌ బోర్డు వాళ్లు వచ్చి కళ్లారా చూశారు. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్‌ గేట్‌ ముందు ఆందోళన చేస్తాం.

– దేవోళ్ల శేఖర్‌ గౌడ్‌,

మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి

పోలేపల్లి సెజ్‌లో 13 వరకు ఫార్మా కంపెనీలు, మరో ఎనిమిది వరకు ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థ జలాలు నేరుగా చెరువులు, కుంటల్లో కలుస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాజాపూర్‌ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు సాగుకు అనువుగా లేక పంటలు పండకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు.

బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు..

లెక్కప్రకారం పరిశ్రమల నిర్వాహకులు ఫార్మా ఉత్పత్తుల తయారీలో వెలువడిన వ్యర్థ జలాలను రీసైక్లింగ్‌ చేసి వదిలేయాలి. అలాంటి పరికరాలు లేకుంటే ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్‌ కేంద్రాలకు పంపించాలి. ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా బయటకు వదులుతున్నారు. వర్షాకాలంలో అయితే వరద పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వారం వారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌తో పాటు నెలకోసారి అయినా హైదరాబాద్‌లోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో వారి రోదన అరణ్యరోదనగా మారింది.

పట్టపగలే ఓ ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని ఈ దృశ్యంలో చూడవచ్చు. రసాయనాలతో రంగు మారిన నీరు నేరుగా సమీపంలోని ముదిరెడ్డిపల్లిలోని పల్లె చెరువు.. దీని గుండా పొలాల్లో చేరుతోంది.

..మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న విష వాయులు, వ్యర్థ జలాలతో పరిసర ప్రాంతాల రైతులు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటిని చేలల్లోకి వదులుతుండడంతో పంటలు పండడం లేదు. చిమ్నీల నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేస్తుండగా.. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పాలక పక్షం, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

గతంలో వర్షాకాలంలో వరద మాటున పలు ఫార్మా పరిశ్రమలు కలుషిత నీటిని విడుదల చేసేవి. ప్రస్తుతం ఓ కంపెనీ రసాయనాలు కలిసి రంగు మారిన వ్యర్థ జలాలను పట్టపగలే సరఫరా చేస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అప్పటివరకు ఊరుకోవడం.. ఆ తర్వాత యథావిధిగా మళ్లీ పంపింగ్‌ చేయడం సర్వసాధారణంగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిత్యం సదరు పరిశ్రమ నుంచి భారీస్థాయిలో దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేస్తుండడం.. భరించలేని దుర్గంధంతో పరిసరాల్లోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులు, యాజమాన్యం గతంలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పీసీబీ ఈఈ సురేష్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు.

నిబంధనలు పట్టించుకోని ఫార్మా

పరిశ్రమలు

చెరువులు, చేలల్లోకి నేరుగా

వ్యర్థ పంపింగ్‌

పంటలు పండకపోవడంతో

ఆందోళనలో రైతులు

వాయు కాలుష్యానికి కేరాఫ్‌గా

మారిన పలు ఫ్యాక్టరీలు

నిత్యం ఆకాశాన్ని కమ్ముకుంటున్న దట్టమైన పొగ

దుర్గంధం భరించలేమంటూ స్థానికుల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement