విచారణ దశలో ఉంది..
ఉద్యోగుల్లో గుబులు..
ఏజెంట్ల వ్యవహారంపై ఆరా..
గద్వాల క్రైం: ఏం చేసిన అడిగేవారు లేరనే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగులు.. ఏ తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చినా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పే ఏజెంట్ల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ వ్యక్తి ఫేక్ ఫొటోతో బైక్ రిజిస్ట్రేషన్ ఘటనపై తాజాగా రూరల్ పోలీసులు బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు మేఘనాథ ఆటో మొబైల్స్ షోరూం మేనేజర్ ఏవీ నర్సింహులుతోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంపై రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ గురువారం రవాణా శాఖ కార్యాలయంలోని ఫేక్ వ్యక్తి ఫొటోతో రిజిస్ట్రేషన్ చేసిన ఉద్యోగులను విచారించారు. ఈ క్రమంలో బైక్ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వ్యక్తి ఎవరు..? అందుకు సమర్పించిన డాక్యూమెంట్లు ఏవి..? ఏజెంట్‌గా వ్యవహరించిన వ్యక్తులు..? షోరూం మేనేజర్ పాత్ర తదితర విషయాలపై కూపీ లాగినట్లు సమాచారం. మరోవైపు ‘సాక్షి’ పత్రికలో ‘ఏజెంట్ల లీలలెన్నో’ కథనం ప్రచురణ కావడంతో ప్రజల నుంచి ఉద్యోగుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువ మొత్తంలో వసూళ్లు
జిల్లాలోని పలు వాహనాల షోరూం డీలర్లు కొనుగోలుదారులను వివిధ షరతులతో ఎక్స్‌షోరూం ధరల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి రవాణా కార్యాలయంలోని అధికారులతో ఏర్పడిన పరిచయాలతోపాటు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తుల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఫైల్స్ కార్యాలయంకు తీసుకెళ్లడం కొనుగోలు చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్‌కు పిలవడం సర్వ సాధారణంగా మారింది. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసే తంతు కొనసాగుతుంది. ముందుస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు కొనుగోలు చేసిన వ్యక్తి డాక్యుమెంట్లు పరిశీలించే సాహసం చేయడం లేదని తెలుస్తుంది. 2023లో నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలోనూ ఏజెంట్లు జైలుకు వెళ్లగా.. అధికారులు మాత్రం తప్పించుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఫేక్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రవాణా శాఖ అధికారులకు మెమోలు సైతం జారీ చేశారు. పోలీసులు సైతం విచారణ చేపట్టడంతో అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తుందని సమాచారం.
షోరూం నిర్వాహకులు ఫేక్ వ్యక్తి ఫొటోతో రిజిస్ట్రేషన్ చేయడంపై బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. అయితే ఈ వ్యవహారంలో షోరూం మేనేజర్‌తోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేశాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రవాణా శాఖ సిబ్బందిని విచారించాం. మరి కొందరిని విచారించాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
– శ్రీకాంత్, రూరల్ ఎస్‌ఐ, గద్వాల
ఫేక్ వ్యక్తి ఫొటోతో బైక్ రిజిస్ట్రేషన్ చేసిన ఉద్యోగులు రెండు రోజుల క్రితమే షోరూం నిర్వాహకులతో రాజీ చేయించి మంగళవారం రాత్రి మరొకరి పేరిట బదలాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా బృందం అధికారుల తీరును ప్రశ్నించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అధికారులు చేసిన తప్పిదం నుంచి బయట పడేందుకు సర్దుబాటు చర్యలు చేపట్టడంతో వారిలో భయం మొదలైందని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చేసిన తప్పును చీకట్లో చేయాలని అధికారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఫెయిల్ కావడం కొసమెరుపు.
జిల్లా రవాణా శాఖ కార్యాలయం సమీపంలో చాలమంది ఆర్టీఏ ఏజెంట్లుగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న సమూదాయాలపై ఆరా తీస్తున్నారు. రోజుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నారు.. అందుకు వాహన యజమానులతో ఎంత ఫీజు వసూలు చేస్తారు.. అధికారులతో ఉన్న సంబంధాలు, ఫైల్స్‌కు ఇస్తున్న ఫీజులపై కూపీలాగారు. కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు చెల్లిస్తున్న అద్దె వివరాలను సైతం పోలీసులు తెలుసుకున్నారు.


