గద్వాల: ఆత్మగౌరవం, ధైర్య సాహసాలకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీకగా నిలుస్తారని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోల్కొండ కుతుబ్‌షాహీ పాలకులు ప్రజలపై అనేక రకాల పన్నులు విధిస్తూ వేధింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తూ ఎదిరించి పోరాటాలు చేశారన్నారు. యుద్ధ విద్యలు నేర్చుకుని ప్రత్యేకంగా సైన్యాన్ని సమకూర్చుకుని పలుచోట్ల కోటలను వశం చేసుకున్నారు. సామాన్య వ్యక్తి నుంచి రాజ్యాలను స్థాపించి పరిపాలన సాగించిన గొప్పవీరుడు పాపన్నగౌడ్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భూపాల్‌రెడ్డి, రాములు, నాయకులు అచ్చన్నగౌడ్, రామన్‌గౌడ్, హరిప్రసాద్‌గౌడ్, నందకిషోర్‌గౌడ్ రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


