జిల్లావ్యాప్తంగా హనుమంతుడి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, ధర్మ ప్రసార సమితి, నాయకులతోపాటు హనుమాన్ దీక్షాపరులతో గద్వాల పట్టణం కాషాయం రంగును సంతరించుకుంది. స్థానిక కోట వద్ద నుంచి ప్రధాన రోడ్డు మార్గాలైన వైఎస్సార్ సర్కిల్, కూరగాయల మార్కెట్ రోడ్డు, పాత ఎస్‌బీహెచ్, కిష్టారెడ్డి బంగ్లా, రాజవీధి, గాంధీచౌక్‌ల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో ర్యాలీ సాగింది. రామలక్ష్మణ జానకి.. జైబోలో హనుమాన్‌కి’ అని నినదిస్తూ.. బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పులు, డీజేలతో యువకులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
– గద్వాల న్యూటౌన్


