జములమ్మ క్షేత్రం.. భక్తజన సంద్రం
గద్వాలన్యూటౌన్: నడిగడ్డ ప్రాంతంలో ప్రసిద్దిగాంచిన జములమ్మ క్షేత్రానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో బారులు తీరారు. 10 గంటల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. 12గంటలకు ఆలయ ప్రాంగణ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, పూనకాలతో ఆలయ పరిసరాల్లో పండగ వాతావరణం కనిపించింది. భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లంగా చూడమ్మా.. జములమ్మ తల్లి అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ పురందర్‌కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది చర్యలు తీసుకున్నారు.


