వణికిస్తున్న చలి..
జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● రెండు వారాలుగా పెరిగిన తీవ్రత
● ఉష్ణోగ్రతల మార్పులతో పెరుగుతున్న వ్యాధులు
● అప్రమత్తతే ముఖ్యమంటున్న వైద్యులు
●
చలి గాలులతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు వీటి నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది. ఆసుపత్రికి దగ్గు, జలుబు తదితర బాధిత చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు. సమస్య తీవ్రమైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగించాలి. తాజా ఆహారం తీసుకోవాలి.
– డాక్టర్ వంశీ, ప్రభుత్వ వైద్యుడు
గద్వాలటౌన్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. శీతాకాలం ఆరంభంలో మొదట చలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికి.. గడిచిన రెండు వారాలుగా చలి తీవ్రత పెరిగింది. ఇటీవల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల స్థాయికి పడిపోయింది. ముందు ముందు పగటి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మొదలవుతుండగా ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లతో చలి నుంచి రక్షణ పొందడానికి యత్నిస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జలుబు, దగ్గు, వైరల్‌జ్వరాలు సొకుతున్నాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలం ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.
చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిరోదకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పుల వలన వారు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయటతిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సులో, ఆటోల్లో వెళ్లే విద్యార్థులకు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్‌లు దరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. దీంతోపాటు పొడి చర్మం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందిపడే అవకాశం ఉంది. చర్మం పగుల్లిచ్చి మంట పుడుతుంది. అందువల్ల చర్మం పొడిబారి పోకుండా చూసుకోవాలి. ఇందుకోసం వ్యాస్‌లెన్, పెట్రోలియంజెల్లి, మాయిశ్ఛరైజర్లు వాడాలి. స్నానానికి కూడా గ్లీజరిన్, మాయిశ్ఛరైజర్ ఉన్న సబ్బులు వాడటం ఉత్తమం.
పొగమంచు..
రోడ్డు ప్రమాదాలు అధికం
తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. ఒక్కసారి మంచు చాలా దట్టంగా కురిసి దారి కనిపించకుండా పోతోంది. దీనివల్ల ముందుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల మంచుకురిసేటప్పుడు వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్లు వేసుకోవడంతో పాటు తక్కువ వేగంతో వాహనాలు నడపాలి. చలికాలం మామూలుగా ఉంటేనే చలితో వణికిపోతాం. అలాంటిది వాహనాలపై ప్రయాణిస్తే వణుకు పుడుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి వస్తే వెచ్చగా ఉండే జర్కిన్‌లు, తలకు, చెవులకు రక్షణగా మంకీక్యాప్, చేతులకు గ్లౌజులు తప్పక ధరించాలి.
జిల్లాలో నమోదైన కనిష్ట
ఉష్ణోగ్రత వివరాలు..
తేదీ కనిష్ట
ఉష్ణోగ్రత
23వ తేదీ 13.4
24వ తేదీ 13.7
25వ తేదీ 13.6
26వ తేదీ 14.0
27వ తేదీ 12.8
వణికిస్తున్న చలి..
వణికిస్తున్న చలి..


