పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్‌చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్‌రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్‌కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 10.5 ఎకరాల స్థలంలో రూ.81 కోట్లతో మూడు అంతస్తులలో 12 కోర్టుల ఒకే భవన సముదాయం ఒకేదగ్గర నిర్మాణం అవుతుందన్నారు. ఈ నూతన భవన నిర్మాణం రాబోయే 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయ జీవనోపాధిగా, పట్టణీకరణతో అభివృద్ధి చెందుతున్న జిల్లా అన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
రెండేళ్లలో కోర్టు భవన నిర్మాణం పూర్తికావాలి
రూ.81 కోట్లతో ఒకే సముదాయంలో 12 కోర్టులు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్


